గోల్కొండ కోటను జయించిన మొనగాడు పాపన్న

– సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పాపన్న పోరాట జీవిత చరిత్రపై ఎగ్జిబిషన్‌ ఏర్పాటు
– సర్దార్‌ సర్వాయి పాపన్న చరిత్రను పరిచయం చేసింది కల్లుగీత కార్మిక సంఘమే : కల్లుగీత ఆర్థిక కార్పొరేషన్‌ చైర్మెన్‌ పల్లె రవికుమార్‌గౌడ్‌
– పాపన్న చరిత్రను తొక్కాలని చూస్తే విత్తనమై మొలకెత్తాడు : జయరాజు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
భూస్వాములకు, మొగల్‌ రాజులకు వ్యతిరేకంగా పోరాడి గోల్కొండ కోటను జయించిన మొనగాడు సర్దార్‌ సర్వాయి పాపన్న అని తెలంగాణ కల్లుగీత ఆర్థిక కార్పొరేషన్‌ చైర్మెన్‌ పల్లె రవికుమార్‌ గౌడ్‌ అన్నారు. ఆయన చరిత్రను తెలంగాణ సమాజానికి పరిచయం చేసిన ఘనత తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘానికే దక్కుతుందని కొనియాడారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని ఐలమ్మ ఆర్ట్‌ గ్యాలరీలో సర్దార్‌ సర్వాయి పాపన్న జీవన పోరాట చిత్రాలతో కూడిన ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ..చరిత్రలో తనకంటూ పేజీలేని వీరున్ని తన కుంచెతో నవ తెలంగాణ ఆర్టిస్టు భాస్కర్‌ అద్భుతంగా చిత్రీకరించారని ప్రశంసించారు. ఛత్రపతి శివాజీ అంతటి చరిత్ర కలిగిన పాపన్న చరిత్రను కూడా వెలుగులోకి తీసుకొచ్చారన్నారు. పాపన్న విగ్రహం లండన్‌ విక్టోరియా మ్యూజియంలో ప్రజల సందర్శనార్థం ఉంచిన విషయాన్ని గుర్తుచేశారు. ఆయన పోరాట చరిత్రను పల్లెపల్లెకూ తీసుకెళ్లి ప్రజలను చైతన్య పర్చాలని కల్లు గీత కార్మిక సంఘాన్ని కోరారు. ప్రకృతి కవి, ప్రజావాగ్గేయకారులు జయరాజు మాట్లాడుతూ పాపన్న చరిత్రను భావితరానికి అందకుండా భూస్థాపితం చేయాలని కొందరు చూశారని విమర్శించారు. కానీ, ఆయన చరిత్ర శుద్ధి చేసిన విత్తనమై భూమిని చీల్చుకొని మొలకెత్తిందన్నారు. పాపన్న చరిత్రను నేటి యువత భుజానికెత్తుకుని ఊరూరా ఆయన విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. పాపన్న పౌరుషాన్ని జానపదుల గుండెల్లో వాళ్ళ గొంతులో పదిలంగా ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత జానపదులదేనని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీత రాములు మాట్లాడుతూ పాపన్న చరిత్ర ను ప్రచారం చేయడం, కల్లు ప్రయోజనాలను పాట ద్వారా తెలపడం చాలా బాగుందన్నారు. కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యం.వి.రమణ మాట్లాడుతూ పాపన్న జీవిత చిత్రాలను మూడేండ్ల నుంచి సేకరించిన కృషి ఫలితమే ఈ ఎగ్జిబిషన్‌ అని చెప్పారు. మన దేశంలో నేటికీ 85 శాతం అణగారిన సామాజిక తరగతుల ప్రజలు రాజ్యాధికారం కోసం పోరాడుతూనే ఉన్నారన్నారు. 370 ఏండ్ల కిందనే సామాన్య కల్లుగీత కార్మికుడైన పాపన్న కత్తి పట్టి మొగల్‌ చక్రవర్తులకు ముచ్చెమటలు పట్టించారనీ, 12,000 సైన్యంతో అశ్వక,పిరంగి, రహస్య గూడాచారి వ్యవస్థ ఏర్పాటు చేసుకొని గోల్కొండ కోటకు రాజయ్యాడని వివరించారు. అలాంటి గొప్ప చరిత్రకు భాస్కర్‌ తన కుంచెతో ఊపిరి పోశారని ప్రశంసించారు. ఈ సందర్భంగా ‘తాటికల్లులో ఔషధాలు పుల్లు’ అనే పాటల క్యాసెట్‌ను జయరాజు ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి టీపీఎస్‌కే నాయకులు భూపతి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. చిత్రకారుడు భాస్కర్‌, పాట రచయిత, సింగర్‌ పల్లె నరేందర్‌ను సత్కరించారు.
కార్యక్రమంలో గీత పనివారల సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, కవి రచయిత కేవీఎల్‌, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, సుప్రజ హాస్పిటల్‌ ఎమ్‌డీ శిగ విజరు కుమార్‌ గౌడ్‌, భీమగోని చంద్రయ్య, వి వెంకట నరసయ్య, కుర్ర ఉప్పలయ్య, అంబాల శ్రీనివాస్‌ , బోయపల్లి సుధాకర్‌, కుర్ర అనిల్‌ ,సురుగు రాజేష్‌, సిద్దిపేట శ్రీనివాస్‌ వివిధ గౌడ సంఘాల నాయకులు అంబాల నారాయణ గౌడ్‌, బూర మల్సూర్‌ గౌడ్‌, ప్రభులింగం గౌడ్‌, రామ్మోహన్‌ గౌడ్‌, కొండల్‌ గౌడ్‌, ఎస్‌ఆర్‌ గ్రూప్‌ జోనల్‌ ఇన్‌చార్జి కృష్ణ గౌడ్‌ తదితరులు మాట్లాడారు.