– పేపర్-1కు 84.12 శాతం, పేపర్-2కు 91.11 శాతం హాజరు
– 27న ఫలితాలు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రశాంతంగా ముగిసింది. పేపర్-1 సులభంగా, పేపర్-2 ప్రశ్నాపత్రం గతంకంటే కొంచం కఠినంగా వచ్చినట్టు నిపుణులు చెప్తున్నారు. పేపర్-2 ప్రశ్నాపత్రం గణితం, సైన్స్ గత టెట్ కంటే కఠినంగా వచ్చినట్టు తెలుస్తున్నది. సోషల్ స్టడీస్ ప్రశ్నాపత్రం కూడా కఠినంగానే వచ్చింది. అయితే ఈనెల 27న టెట్ ఫలితాలను విడుదల చేయాలని నోటిఫికేషన్‌లోనే అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్, టెట్ కన్వీనర్ ఎం రాధారెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. టెట్ పేపర్-1కు 2,69,557 మంది దరఖాస్తు చేస్తే వారిలో 2,26,744 (84.12 శాతం) మంది హాజరయ్యారని తెలిపారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 15,490 మంది దరఖాస్తు చేయగా, 14,771 (95.36 శాతం) మంది అభ్యర్థులు పరీక్ష రాశారని వివరించారు. అత్యల్పంగా నల్లగొండ జిల్లాలో 12,423 మంది దరఖాస్తు చేస్తే, 9,614 (77.39 శాతం) మంది హాజరయ్యారని పేర్కొన్నారు. పేపర్-2కు 2,08,498 మంది దరఖాస్తు చేయగా, వారిలో 1,89,963 (91.11 శాతం) మంది అభ్యర్థులు పరీక్ష రాశారని తెలిపారు. అత్యధికంగా వికారాబాద్‌లో 3,846 మంది దరఖాస్తు చేస్తే, 3,689 (95.92 శాతం) మంది హాజరయ్యారని పేర్కొన్నారు. అత్యల్పంగా రంగారెడ్డి జిల్లాలో 13,386 మంది దరఖాస్తు చేయగా, 11,071 (82.71 శాతం) మంది పరీక్ష రాశారని వివరించారు.
ఇక అందరిదృష్టి డీఎస్సీపైనే…
ఉపాధ్యాయ అభ్యర్థులందరి దృష్టి ఇక నుంచి డీఎస్సీపైనే ఉండనుంది. రాష్ట్రంలో 6,612 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో 5,089 ఉపాధ్యాయ పోస్టులు, 1,523 ప్రత్యేక (డిజెబుల్డ్) టీచర్లకు సంబంధించిన ఖాళీలున్నాయి. వాటికి భర్తీకి సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. అయితే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఆధ్వర్యంలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) కాకుండా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలోనే జిల్లా నియామక కమిటీ (డీఎస్సీ) ద్వారా నియామకాల ప్రక్రియను చేపట్టనున్న విషయం తెలిసిందే. అయితే 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకే డీఎస్సీ నోటిఫికేషన్ ఈనెల ఏడో తేదీన విడుదలైంది. ఇందులో 1,739 స్కూల్ అసిస్టెంట్, 2,575 ఎస్జీటీ, 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టులున్నాయి. మొదటిసారిగా డీఎస్సీ రాతపరీక్షలను నవంబర్ 20 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష (సీబీఆర్టీ) విధానంలో నిర్వహిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 20 నుంచి వచ్చేనెల 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.