పారా ప్రపంచం

Para world– ఆరంభ వేడుకలకు పారిస్‌ ముస్తాబు
– నేటి నుంచి 2024 పారాలింపిక్స్‌
లక్ష్య సాధనకు వైకల్యం అడ్డు కాదు అంటూ నిరూపించే పారా వీరులు పారిస్‌ పారాలింపిక్స్‌లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. 2024 పారిస్‌ పారాలింపిక్స్‌ నేటి నుంచి ఆరంభం కానున్నాయి. పారిస్‌ నగరం ఆరంభ వేడుకలకు ముస్తాబు కాగా.. సమ్మర్‌ ఒలింపిక్స్‌ తరహాలోనే భారీ స్థాయిలో ఓపెనింగ్‌ సెర్మానీకి ప్రణాళికలు రచించారు. 167 దేశాల నుంచి పారా అథ్లెట్లు పోటీపడుతున్న మెగా ఈవెంట్‌ సెప్టెంబర్‌ 9న ముగియనుంది.
నవతెలంగాణ-పారిస్‌
ప్రపంచ వ్యాప్తంగా వైకల్యాన్ని ఎదురించి నిలిచిన పారా అథ్లెట్లు పారిస్‌ వేదికగా పతక వేటలో పోటీ పడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. పారిస్‌ నగరం తొలిసారి సమ్మర్‌ పారాలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వనుండగా.. 167 దేశాల నుంచి పారా అథ్లెట్లు పోటీ పడనున్నారు. పారాలింపిక్స్‌ ఆరంభ వేడుకలు భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 11.30 గంటలకు ఆరంభం కానున్నాయి. సెప్టెంబర్‌ 9న ముగింపు వేడుకలు జరుగుతాయి. ఆరంభ వేడుకల అథ్లెట్‌ పరేడ్‌లో భారత పతాకధారులుగా జావెలిన్‌ త్రో స్టార్‌ సుమిత్‌, షాట్‌పుట్‌ స్టార్‌ భాగ్యశ్రీ జాదవ్‌ వ్యవహరించనున్నారు.
22 స్పోర్ట్స్‌, 549 ఈవెంట్లు : 2024 పారాలింపిక్స్‌లో పారా క్రీడాకారులు 22 క్రీడాంశాల్లో 549 పతక ఈవెంట్లలో పోటీపడనున్నారు. 2024 పారిస్‌ పారాలింపిక్స్‌లో కొత్తగా మూడు క్రీడలను చేర్చారు. పారా సైక్లింగ్‌, పారా జూడో, పారా రోయింగ్‌లు తొలిసారి పారాలింపిక్స్‌లో భాగం అయ్యాయి. ఈ మూడు కొత్త క్రీడల్లో భారత్‌ నుంచి పారా అథ్లెట్లు పోటీపడుతున్నారు. 167 దేశాల నుంచి పారా క్రీడాకారులు పారిస్‌లో పోటీపడుతుండగా.. రష్యా, బెలారస్‌ పారా అథ్లెట్లు తటస్థ జెండా కింద పోటీపడనున్నారు. శరణార్థుల జట్టు సైతం పారాలింపిక్స్‌ బరిలోకి నిలిచింది.
50కి పైగా స్పోర్ట్స్‌ విభాగాలు! : పారాలింపిక్స్‌లో పారా అథ్లెట్లు అందరూ ఒకే విభాగంలో పోటీపడలేరు. శారీరక వైకల్యం, ఫిజికల్‌ యాక్టీవిటీ ఆధారంగా పారా అథ్లెట్లను పలు విభాగాలుగా విభజిస్తారు. శారీరక వైకల్యం, కంటిచూపు లోపం, ఇంటలెక్చువల్‌ వైకల్యం విభాగాల్లో వైకల్యం శాతం ఆధారంగా విభాగాలను నిర్ణయిస్తారు. పారా పవర్‌లిఫ్టింగ్‌ వంటి కొన్ని క్రీడల్లో మినహా మిగతా అన్ని క్రీడాంశాల్లోనూ స్పోర్ట్స్‌ క్లాస్‌లు ఉంటాయి. పారా అథ్లెటిక్స్‌లో కొన్ని విభాగాల్లో ఏకంగా 50కి పైగా స్పోర్ట్స్‌ క్లాస్‌లు ఉంటాయి.
భారత్‌ నుంచి జంబో జట్టు : టోక్యో పారాలింపిక్స్‌లో టీమ్‌ ఇండియా సూపర్‌ సక్సెస్‌ చవిచూసింది. ఏకంగా 19 పతకాలతో సత్తా చాటింది. పారిస్‌ పారాలింపిక్స్‌లోనూ భారత్‌ పతకాలపై భారీగా ఆశలు పెట్టుకుంది. పారిస్‌లో 84 మంది భారత పారా అథ్లెట్లు పోటీపడుతున్నారు. పారాలింపిక్స్‌లో భారత్‌ నుంచి ఇదే అతిపెద్ద ప్రాతినిథ్యం!. భారత పారా అథ్లెట్లలో సీజనల్‌ స్టార్స్‌తో పాటు కొత్త ముఖాలు సైతం పతక వేటలో ముందంజలో ఉన్నారు. సుమిత్‌ అంతిల్‌ (జావెలిన్‌ త్రో), అవని లేఖర (షూటింగ్‌), మనీశ్‌ నర్వాల్‌ (షూటింగ్‌), కృష్ణ నగర్‌ (బ్యాడ్మింటన్‌), శీతల్‌ దేవి (ఆర్చరీ) బంగారు పక రేసులో నిలిచారు. టోక్యో పారాలింపిక్స్‌ పసిడి విజేత ప్రమోద్‌ భగత్‌ డోపింగ్‌ సంబంధిత కారణాలతో పారిస్‌ పారాలింపిక్స్‌కు దూరమయ్యాడు.