శతాయుష్షు దాటిన రావి చెట్టు ఆకులు చిన్న గాలికే రెపరెపలాడుతూ ఇంపైన సంగీతం వినిపిస్తోంది.
మధ్యాహ్నం వేసవి ఎండ విపరీతంగా చెమటలు పట్టిస్తుంది. బాటసారులు గత్యంతరం లేక జీవితంలో ఓ భాగంగా నడుస్తూనే ఉన్నారు.
”దేవుడు కనీసం కనికరమైన చూపట్లేదు! రోజు రోజుకూ నరకం చూపుతున్న ఎండలు!” రావి చెట్టు కింద నీడకు నిలబడ్డ ఆటో డ్రైవరొకడు మరో ఆటో డ్రైవర్తో అంటున్నాడు.
రావి చెట్టు కిందనే దేవాలయం ఉంది. దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న భక్తుల సంఖ్య క్రమంగా పలచబడసాగింది.
కానీ, అంతటి మండుటెండలోనూ ఒకే ఒక వ్యక్తి రెండు చేతులూ జోడించి ఆ ఆలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఏం ఉచ్ఛరిస్తున్నాడో గానీ పెదవుల కదలిక మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. పొడవైన బక్కచిక్కిన దేహం. మెడలో సిల్వర్ రంగు శిలువ వేలాడుతుంది. పక్కటెముకలు తేలి అస్థిపంజరపు గూడులా ఉంది. ఎటువంటి అచ్ఛాదన లేని ఛాతీపై ఆ శిలువ గోడ గడియారపు లోలకంలా ఊగుతూ ఉంది. గమనించి చూస్తేనే అతని మెడలోని ఆ శిలువ స్పష్టంగా కనిపిస్తుంది. దూరం నుంచైనా మాసిన గడ్డం స్పష్టంగా కనబడుతున్నది. తలపైన చిందరవందరగా పెరిగిన జుట్టు. రోజుల తరబడి కడుపు నిండా భోజనం చేయలేదని ఇట్టే తెలిసిపోతుంది.
ఉన్నట్టుండి దేవాలయం లోపల పూజలు చేస్తున్న భక్తుల్లో కోలాహలం మొదలైంది. అది కాస్తా గుడి బయటికి పాకింది.
జనాలు గుమిగూడారు. విపరీతంగా కాస్తున్న ఎండను మరిచేపోయారు. తలా ఒక మాట వారి నోటి గుండా వేగంగా రాసాగింది.
అస్థిపంజరం తన గూడును వెంటపెట్టుకొని నడుస్తున్న విషయాన్ని ఒకరిద్దరు చూశారు. అది దైవ మందిరం చుట్టూ తిరగసాగింది.. వేగంగా. ఏదో మునిగి పోతున్నట్టు.
రోడ్డుపై నడుస్తున్న జనాలే గాక చుట్టుపక్కల ఉన్న ఇండ్లవారూ గుమిగూడారు. కొందరైతే చెప్పులతో ఆ గూడుపై దాడి చేశారు.
”ఎక్కడ్నుంచి వచ్చావురా… వెధవా?” తిట్ల పురాణం మొదలైంది.
ఒకరు లైట్‌గా అతన్ని తిడితే మరి కొందరు హార్డ్‌గా తిట్టారు.
దూరంగా నిలబడి తమాషాగా చూస్తున్న వాళ్లలో ఒకడు, ”అటు వైపు చూడు! పాపం అతడి భక్తికి మెచ్చి దేవుడైనా కనికరం చూపట్లేదు!?” అన్నాడు.
కొద్దిసేపట్లో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
పోలీస్ స్టేషన్లో దేహశుద్ధి చేసి, ఆరా తీశారు. యక్ష ప్రశ్నలు అడిగారు. చివరికి పోలీసులు సహనం కోల్పోయారు. అస్థిపంజరాన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అప్పటికే బ్రేకింగ్ న్యూస్‌లు టీవీ తెరల పైకెక్కాయి. యూ ట్యూబ్ ఛానల్స్‌లోకీ దూరాయి… వింత వింత పోకడలతో.
రెండోరోజు ఉదయం పోలీస్ ప్రకటన ఒకటి విడుదలైంది. ఒక్క మాటలో దాని సారాంశం ఇలా ఉంది.
‘అతడు ముస్లిం గాదు, క్రిస్టియన్ గాదు. మతి స్థిమితం లేనివాడు.’ అని.
ఈ రోజు ఉదయమే వార్తా పత్రికలో ఆ విషయం చదివాక.. నాకు సతీమణి ప్రేమగా కలిపి ఇచ్చిన కాఫీ విషంగా అనిపించింది.
‘మతి స్థిమితం లేనిది గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన వాడికా.. దేహశుద్ధి చేసిన ప్రజలకా!?’
ప్రశ్నోదయం…మనసులో!?
amjuali1993@gmail.com
– అమ్జద్
00 966 507662638