మండలంలోని చౌట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి ఆంధ్రయ్య అధ్యక్షతన తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించారు. 90 మంది విద్యార్థుల తల్లిదండ్రులు హాజరైన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. విద్యార్థులలో క్రమశిక్షణ, ప్రవర్తనలో రావాల్సిన మార్పులను, విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి కల్పించాలని చర్చించారు. పిల్లల ప్రగతికై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సహకరించుకొని జిల్లాలోనే మంచి మార్కులు సాధించేలా ప్రయత్నం చేయాలని నిర్ణయించారు. మధ్యాహ్న భోజన పనితీరుపై, ఉపాధ్యాయుల పనితీరు, తల్లిదండ్రుల బాధ్యత పై చర్చించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యాలా చూడడం, ఇంటి వద్ద పిల్లల పనితీరు, చదువుకోవడానికి మంచి వాతావరణం కల్పించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు శ్రీనివాస్, బంతిలాల్, రాజు, మధు, వర్ష, శ్రీలత, శ్రీనివాస్, ప్రవళిక, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.