తల్లిదండ్రులు పిల్లల ఆసక్తిని గమనించి ప్రోత్సహించాలి

నవతెలంగాణ – కంటేశ్వర్ 
పట్టణంలోని ఆక్స్ఫర్డ్ హైస్కూల్లో తల్లిదండ్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు ముఖ్య అతిథిగా హాజరవగా, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కపిల్, సెక్రెటరీ రాజా గౌడ్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఇంకా ఈ సమావేశంలో లీడ్ విద్యా వ్యవస్థ చీఫ్ ట్రైనర్స్ ప్రసన్నకుమార్, అకాడమిక్ కోఆర్డినేటర్ సుష్మేంద్ర హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.తొలుతగా పాఠశాల కరస్పాండెంట్ మామిడాల మోహన్ మాట్లాడుతూ, పిల్లలలో ప్రత్యేకమైన ప్రతిభ దాగి ఉంటుందని దానిని వెలికి తీసే విధంగా ప్రోత్సహించడమే తల్లిదండ్రుల, గురువుల బాధ్యత అని తెలిపారు. చదువు ఒకటే ముఖ్యం కాదని చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర ఆసక్తిగల అంశాల పట్ల తల్లిదండ్రులు గ్రహించి వారికి ప్రత్యేకమైన ప్రోత్సాహం కలగజేయాలని అప్పుడే వారు చదువులో కూడా రాణించగలుగుతారని అన్నారు.  ఇతర పిల్లలతో బేరీజు వేసుకోవడం మంచి సంప్రదాయం కాదన్నారు. పిల్లలు ఆశించేది తల్లిదండ్రుల ప్రేమ. తల్లిదండ్రులతో కనీసం రోజుకి ఒక గంటపాటైనా ఆనందంగా గడపాలని కోరుకుంటారన్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాఠశాలలో ఏర్పాటుచేసిన ప్రత్యేక సదుపాయాల్ని, ఒకేషనల్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ కోడింగ్ మొబైల్ యాప్ డెవలపింగ్ ఇలాంటి కోర్సుల్ని ప్రవేశపెట్టామని వివరించారు. వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయన కొన్ని రాయితీలు ప్రకటించారు. చదువులో ప్రతిభ కనబరిచే పేద విద్యార్థులకు ఉచిత విద్యను ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.తదుపరి  జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి రాజా గౌడ్ మాట్లాడుతూ.. చిన్న పాఠశాలైనా విద్యార్థులు అథ్లెటిక్స్ లో అద్భుతాలు సృష్టిస్తున్నారని, గత సంవత్సరం అక్టోబర్ లో జరిగిన పోటీలలో ఆక్స్ఫర్డ్ పాఠశాల విద్యార్థులు 8 పథకాలు సాధించగా పోయిన వారంలో జరిగిన అథ్లెటిక్స్ పోటీలలో సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొనగా అందులో 16 మెడల్స్ ఆక్స్ఫర్డ్ పాఠశాలకు రావడం అద్భుతం అనికొనియాడారు. రాబోయే కాలంలో జిల్లాలోని విద్యార్థులకు సమ్మర్ క్యాంపులో ఉచిత అథ్లెటిక్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆక్స్ఫర్డ్ పాఠశాల నుండి 20 మందిని ఎంపిక చేసి వారికి ఉచితంగా శిక్షణ ఇస్తామని ఆయన తెలియజేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. తల్లిదండ్రులు వారి పిల్లల ఆసక్తిని గమనించి ప్రోత్సహించినట్లయితే అద్భుతాలు సృష్టిస్తారాని, ఇందుకు నిదర్శనం ఆక్స్ఫర్డ్ పాఠశాల చిన్నారలని, ఒకే పాఠశాలకి 16 మెడల్స్ రావడం, విద్యార్థులకి వ్యక్తిగత ఛాంపియన్షిప్స్ ,పాఠశాలకి జిల్లా ఓవరాల్ ఛాంపియన్ షిప్ ను అథ్లెటిక్స్ లో సాధించడం గర్వకారణం అన్నారు. జిల్లాలోని మిగతా పాఠశాలల విద్యార్థులు వారిని ఆదర్శంగా తీసుకొని క్రీడల్లో రాణించాలని ఆయన హితవు పలికారు. జిల్లా స్థాయిలో ఓవరాల్ ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకుని, రాష్ట్రస్థాయికి ఎంపికై, ఖమ్మంలో అథ్లెటిక్స్ ఆడి వచ్చిన విద్యార్థులను అభినందించారు. పథకాలు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులతో కలిపి శాలువా, జ్ఞాపికలతో సత్కరించి అభినందించారు. గెలుపొందిన విద్యార్థులకు అథ్లెటిక్స్ జిల్లా చాంపియన్షిప్ లో వచ్చిన అవార్డులను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో లీడ్ ఎడ్యుకేషన్ సిస్టం సీనియర్ అకాడమిక్ అడ్వైజర్ ప్రసన్న, అకాడమిక్ అడ్వైజర్ సుష్మేంద్ర, జాతీయ నూతన విద్యా విధానాన్ని అనుసరించి నిర్వహిస్తున్న లీడ్ ప్రణాళికని వివరించి, తల్లిదండ్రుల  ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. అథ్లెటిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కపిల్  విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటుచేసిన విద్యార్థుల ప్రతిభ ప్రదర్శనను తల్లిదండ్రులు ఆసక్తికరంగా పరిశీలించారు. ఈ ప్రదర్శన విద్యార్థుల ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. ఈ సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.రమణ, ఇన్చార్జి గంగాధర్, శ్రీశైలం, స్వప్న, ఉపాధ్యాయ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.