– పాఠశాల విద్యాశాఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 14న తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాన్ని పిల్లలకు సంతోషకరమైన బాల్యాన్ని ఇచ్చే భరోసా పేరుతో నిర్వహించాలని వివరించారు. రాష్ట్రంలోని ఆర్జేడీలు, డీఈవోలు ఈనెల 14న తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాన్ని అన్ని పాఠశాలల్లో నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తల్లిదండ్రులను ఈ సమావేశానికి ఆహ్వానించాలని కోరారు. వంద శాతం తల్లిదండ్రుల హాజరు ఉండేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల విద్యాప్రమాణాల పెంపు గురించి వారితో చర్చించాలని వివరించారు. పాఠశాలలను సమాజంతో సంబంధం ఉండేలా చూడాలనీ, తల్లిదండ్రులను అందులో భాగస్వామ్యం చేయాలని తెలిపారు. విద్యార్థుల నమోదును పెంచేందుకు వారి సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. పాఠశాల అభివృద్ధి, కార్యక్రమాల నిర్వహణ, విద్యార్థుల అభివృద్ధి, పాఠశాల వృద్ధిలోనూ భాగస్వాములను చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు, పట్టణ ప్రాంతాల్లో ఇతర పనులకు తల్లిదండ్రులు వెళ్తారనీ, వారికి అనువైన సమయాన్ని కేటాయించి సమావేశాన్ని నిర్వహించాలని తెలిపారు. తల్లిదండ్రుల అభిప్రాయాలను నమోదు చేయాలనీ, ఆ సమాచారాన్ని తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. పాఠాలను ఇంటివద్ద చదివే విధంగా విద్యార్థులను ప్రోత్సహించేలా వారిలో అవగాహన కల్పించాలని కోరారు.