– రెవెన్యూ కార్యాలయాల చుట్టూ రైతుల ప్రదక్షిణలు
– అధికారులు..సిబ్బంది కాలయాపనతో నరకయాతన
– ముడుపులు ముట్టజెప్పనిదే లభించని పరిష్కారం
– ప్రక్షాళన చేస్తేనే అన్నదాతలు, లబ్ధిదారులకు ప్రయోజనం
ప్రతి మనిషికి రెవెన్యూ కార్యాలయంతో సంబంధం ఉంటుంది. ఏదేని ధ్రువపత్రం కావాలన్నా..ఈ కార్యాలయాన్ని సంప్రదించాల్సిందే. ముఖ్యంగా రైతుల జీవితాలన్ని తహసీల్దార్ కార్యాలయాలతోనే ముడిపడి ఉంటాయనడంలో సందేహం లేదు. ఇంతటి కీలక కార్యాలయాల్లో అవినీతి, అలసత్వం రాజ్యమేలుతోంది. ప్రభుత్వాలు మారుతున్నా..పాలకులు మారుతున్నా ఈ కార్యాలయాల పనితీరు మాత్రం మారడం లేదు. వివిధ చోట్ల తహసీల్దార్ కార్యాలయాల్లో చేతివాటం ప్రదర్శిస్తున్న అధికారులు, సిబ్బంది అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ)కి పట్టుబడుతున్నా అక్రమాల పర్వం ఆగడంలేదనే ఆరోపణలున్నాయి. ప్రక్షాళన చేద్దామని ప్రభుత్వాలు ఎంత ప్రయత్నించినా..ఏదో ఒక లోపాన్ని సాకుగా తీసుకొని ఈ అమ్యామ్యాల పరంపర కొనసాగుతోందనే విమర్శలున్నాయి. ఫలితంగా చిన్న,సన్న కారు రైతులతో పాటు విద్యార్థులు, వివిధ పథకాల కోసం అర్హులైన లబ్ధిదారులు అవస్థలు పడాల్సి వస్తోంది.
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి, బేల
రైతులు, విద్యార్థులు, లబ్ధిదారులకు వెన్నుదన్నుగా ఉంటూ వారి సమస్యల పరిష్కారంలో ముందువరుసలో ఉండాల్సిన రెవెన్యూ కార్యాలయలు వారికి అవస్థల నిలయాలుగా మారుతున్నాయి. ప్రతి చిన్న పనికి కూడా ఏదో రూపంలో ముట్టజెబితే కానీ పరిష్కారం లభించని స్థితికి దిగజారుతున్నాయి. కొందరు అధికారులు, సిబ్బంది కాసుల కక్కుర్తి కారణంగా అమాయక రైతులు, వివిధ పథకాల పొందే పేదలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రైతులకు సంబంధించి పహణీలు, రిజిస్ట్రేషన్లు, ఫారమ్ నెం.7, భూమి వాల్యూయేషన్, భూమి కొలతలు, మరణ, డిపెండెంట్ సర్టిఫికేట్, కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలు తదితర వాటి కోసం తప్పనిసరిగా రెవెన్యూ కార్యాలయాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఆయా పత్రాల కోసం దరఖాస్తులు చేసిన తర్వాత వాటిని పరిశీలిస్తున్న అధికారులు, సిబ్బంది నిర్ధిష్ట కాలపరిమితి లోపు అందజేయాల్సి ఉంటుంది. కానీ నెలలు గడుస్తున్నా ఆయా ధ్రువపత్రాలు లబ్ధిదారుల దరికి చేరడం లేదు. కొందరు రైతులు, వివిధ పథకాలు పొందే లబ్ధిదారులకు ఆయా పత్రాలు త్వరగా సమర్పించాల్సి ఉంటుంది. దీంతో ఇదే అవకాశంగా భావిస్తున్న కొందరు సిబ్బంది రోజుల తరబడి కార్యాలయాల వెంట తిప్పుతున్నారు. ఈ బాధలు భరించలేని కొందరు రైతులు వారికి ఎంతో కొంత ముట్టజెపుతున్నారు. దీంతో కార్యాలయాల వెంట తిరగాల్సిన ఇబ్బందులు లేకుండా సులువుగా పని అవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కొన్ని కార్యాలయాల్లో భూమి కొలతల కోసం చలాన్లు కట్టి రోజుల తరబడి సర్వేయర్ల కోసం వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. వారితో లోపాయికారి ఒప్పందం చేసుకున్న వారికి మాత్రం తొలి ప్రాధాన్యమిస్తున్నారని..చలాన్లు కట్టి నెల గడుస్తున్నా మా పొలాలకు వారు రావడం లేదని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పట్టుబడుతున్నా మారని తీరు..!
జిల్లాలోని కొన్ని తహసీల్దార్ కార్యాలయాలు అక్రమాలకు నిలయాలుగా మారుతున్నాయనే ఆరోపణలున్నాయి. ప్రతి ఏటా ఒకటి, రెండు చోట్ల ఈ కార్యాలయాల్లో వివిధ స్థాయిలోని అధికారులు, సిబ్బంది అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి పట్టుబడుతున్న సందర్భాలున్నాయి. కిందటేడాది భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం రైతుల నుంచి డబ్బులు తీసుకున్నారనే కారణంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఓ మండలానికి చెందిన తహసీల్దార్, ఆర్‌ఐలు ఏసీబీకి పట్టుబడ్డాయి. నిర్మల్ జిల్లాలోని ఓ మండలానికి చెందిన తహసీల్దార్ సైతం ఏసీబీకి పట్టుబడిన ఉదంతాలు ఉన్నాయి. మరోపక్క గత ప్రభుత్వం భూ సంబంధిత సమస్యల పరిష్కారం.. రెవెన్యూ ప్రక్షాళన చేద్దామని భావించి ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చింది. కానీ అందులోనూ అనేక లోపాలు ఉండటంతో వీటిని అవకాశంగా మల్చుకుంటున్న కొందరు అధికారులు, సిబ్బంది ఇందులోనూ చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీర్ఘకాలికంగా భూ సంబంధిత సమస్యలకు పరిష్కారం లభించక అనేక మంది రైతులు అవస్థలు పడుతుండగా.. కొందరు ఆ బాధలు భరించలేక సిబ్బందికి ఎంతో కొంత ముట్టచెపుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా నూతన ప్రభుత్వం..పాలకులు, ఉన్నతాధికారులు ఆయా సమస్యల పరిష్కారంపై దృష్టిసారించి రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని రైతులు, లబ్ధిదారులు కోరుతున్నారు.