పారిస్‌ పిలుస్తోంది!

Paris is calling!– నేడు 2024 ఒలింపిక్స్‌ ఆరంభ వేడుకలు
– భారత పతాకధారులుగా సింధు, శరత్‌ కమల్‌
206 దేశాలు. 329 పతక ఈవెంట్లు. 32 క్రీడాంశాలు. ప్రపంచ మేటీ అథ్లెట్లతో పోటీపడి విశ్వవిజేతగా నిలిచేందుకు ప్రతి క్రీడాకారుడు స్వప్నిస్తుండగా.. నేడు పారిస్‌ 2024 ఒలింపిక్స్‌ ఆరంభ వేడుకలు జరుగనున్నాయి. పి.వి సింధు, అచంట శరత్‌ కమల్‌ ఆరంభ వేడుకల పరేడ్‌లో భారత పతాకధారులుగా వ్యవహరించనున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 11.30 గంటలకు ఆరంభ వేడుక షురూ కానుంది.
నవతెలంగాణ – పారిస్‌
ఎప్పుడు, ఎక్కడీ
2024 పారిస్‌ ఒలింపిక్స్‌ ఆరంభ వేడుకలు వైవిధ్యంగా ప్రణాళిక చేశారు. సహజంగా ఆతిథ్య దేశ జాతీయ స్టేడియంలో ఆరంభ వేడుకలు జరుగుతాయి. కానీ పారిస్‌ ఒలింపిక్స్‌ ఆరంభ వేడుకలు మాత్రం నదీ తీరంలో జరుగనున్నాయి. పోటీపడే దేశాల అథ్లెట్ల పరేడ్‌ మైదానంలో కాకుండా.. నదిలో పడవలో సాగుతుంది. ముగింపు వేడుకలు మాత్రం ఫ్రాన్స్‌ జాతీయ స్టేడియం నిర్వహించనున్నారు. ‘వేగంగా వెళ్లాలని అనుకుంటే ఒంటరిగా వెళ్లు.. చాలా దూరం వెళ్లాలని అనుకుంటే కలిసి వెళ్లు’అనే నినాదంతో పారిస్‌ ఒలింపిక్స్‌ సాగనున్నాయి.
భారత్‌ పతక ఆశలు
2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. ఓ పసిడి, రెండు రజతాలు సహా నాలుగు కాంస్య పతకాలు సాధించింది. నీరజ్‌ చోప్రా భారత క్రీడా చరిత్రలో స్వర్ణ చరిత్ర లఖించాడు. టోక్యో ఒలింపిక్స్‌ ముగిసి మూడేండ్లు గడిచాయి. భారత్‌ విశ్వ క్రీడల్లో పతక వేట మరింత మెరుగుపర్చుకుంది. ఒలింపిక్స్‌లో భారత్‌ ఇప్పటివరకు 35 పతకాలు సాధించింది. హాకీలో 12 మెడల్స్‌ రాగా.. అందులో స్వర్ణాలు సైతం ఉన్నాయి. పారిస్‌లో నీరజ్‌ చోప్రా, పి.వి సింధు, మీరాబాయి చాను సహా నిఖత్‌ జరీన్‌, ఇషా సింగ్‌లపై పతక ఆశలు భారీగా ఉన్నాయి. భారత్‌ రెండెంకల పతకాలను చేరుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
గ్లోబల్‌ స్టార్స్‌ మెరుపుల్‌
టెన్నిస్‌ దిగ్గజం రఫెల్‌ నాదల్‌ చివరిసారి ఒలింపిక్స్‌ బరిలో నిలిచాడు. చారిత్రక ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిళ్లు సాధించిన చోట స్పెయిన్‌ బుల్‌ ఒలింపిక్‌ పసిడి వేట సాగిస్తున్నాడు. జిమ్నాస్టిక్స్‌ ఐకాన్‌ సిమోనె బైల్స్‌, చైనా టేబుల్‌ టెన్నిస్‌ దిగ్గజం మా లాంగ్‌లు పారిస్‌ ఒలింపిక్స్‌లో ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు.
ఆ రెండు దేశాలు అవుట్‌
పారిస్‌ విశ్వ క్రీడల్లో 209 దేశాలు పోటీపడుతున్నాయి. ఒలింపిక్స్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన దేశం రష్యాకు మరోసారి నిరాశే ఎదురైంది. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) రష్యాతో పాటు బెలారస్‌ను పారిస్‌ క్రీడలకు దూరం పెట్టింది. ఈ రెండు దేశాలకు చెందిన క్రీడాకారులు తటస్థ అథ్లెట్లుగా బరిలోకి దిగుతున్నారు.