– లోక్‌సభలో ఇండియా ఫోరం ఎంపీల వాకౌట్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో జార్ఖండ్ అంశంపై వాడివేడిగా చర్చ జరిగింది. ప్రతిపక్షాల నినాదాలతో పార్లమెంట్ దద్దరిల్లింది. శుక్రవారం ఉదయం ఉభయ సభలు ప్రారంభమైన తరువాత హేమంత్ సోరెన్ అరెస్టు అంశాన్ని ఇండియా ఫోరం నేతలు లేవనెత్తారు. కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ఆ పార్టీ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ”బీహార్‌లో నితీశ్ కుమార్ రాజీనామా చేసిన 12 గంటల్లోనే కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. జార్ఖండ్‌లో మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నా చంపాయ్ సోరెన్ ప్రమాణ స్వీకారాన్ని జాప్యం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రోద్భలంతోనే హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేశారు. రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం ముక్కలు చేస్తోంది” అని విమర్శించారు. ఖర్గే వ్యాఖ్యలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తోసిపుచ్చారు. ”జార్ఖండ్‌లో వెలుగుచూసిన భూ కుంభకోణం కారణంగా ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన వ్యక్తికి కాంగ్రెస్ మద్దతు తెలుపుతున్నది. ఇది ఆ పార్టీ వైఖరికి నిదర్శనం” అని విమర్శించారు. మరోవైపు లోక్‌సభలోనూ ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర చర్చ జరిగింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ధోరణికి నిరసనగా ఉభయ సభల నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. ”జార్ఖండ్‌లో నేడు ఏం జరుగుతుందో చూశాం. ఇది ప్రజాస్వామ్యంపై బీజేపీ చేస్తున్న దాడి. అయినప్పటికీ, దాని గురించి మాట్లాడే అవకాశం మాకు ఇవ్వకపోవడం విచారకరం” అని కాంగ్రెస్ లోక్‌సభ ఉపనేత గౌరవ్ గొగోయ్ అన్నారు. ”ప్రభుత్వం ఏర్పడటం, కూలడం జరుగుతూనే ఉంటుంది. అయితే స్వతంత్ర సంస్థలు అధికారంలో ఉన్నవారిపై ఆధారపడితే,, అది దేశ ప్రయోజనాలకే కాదు, దాని స్వతంత్రతకే వ్యతిరేకం” అని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది అన్నారు.
కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలపై దుమారం
బడ్జెట్ కేటాయింపుల్లో తమకు అన్యాయం జరుగుతున్నదనీ, ఇదే కొనసాగితే.. దక్షిణాది రాష్ట్రాలలో ప్రత్యేక దేశం ఏర్పాటుచేయాలనే డిమాండ్ రావొచ్చని కాంగ్రెస్ ఎంపీ డికె సురేష్ వ్యాఖ్యానించారు. దీనిపై ఉభయ సభల్లోనూ తీవ్ర దుమారం చెలరేగింది. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని రాజ్యసభలో పీయూష్ గోయల్ డిమాండ్ చేశారు. దేశాన్ని ఒక్కటిగా ఉంచాలనేదే కాంగ్రెస్ సిద్ధాంతమని, విభజన కోరే వారికి పార్టీ ఎప్పటికీ మద్దతు తెలపదని ఖర్గే స్పష్టం చేశారు. డీకే సురేష్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలనీ, ఆయనపై పార్టీ తక్షణం చర్యలు తీసుకోవాలని లోక్‌సభలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు.
అసోం సీఎం వ్యాఖ్యలపై ఖర్గే మండిపాటు
వర్ణ వ్యవస్ధనుద్దేశించి అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ సోషల్ మీడియా పోస్ట్‌పై దుమారం చెలరేగింది. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ తరహా భాషను వాడటం సిగ్గుచేటని, తక్షణమే ఆయనను తొలగించాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న ఆ సీఎం ప్రస్తుతం బీజేపీ పంచన చేరారని, ఆయన పేరును కూడా తాను ప్రస్తావించనని ఖర్గే చెబుతూ శర్మ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. ”వ్యవసాయం, వ్యాపారం వైశ్యుల సహజ కర్తవ్యాలని, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులకు సేవలు చేసే విధి శూద్రులది” అని బీజేపీ సీఎం ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ పోస్ట్‌ను తరువాత డిలీట్ చేశారు. ఓ సీఎం ఇలా మాట్లాడతారా? ఇలాంటి ఆలోచనలు కలిగిన ఆయన పేదల కోసం ఏం పనిచేస్తారని ఖర్గే నిలదీశారు. ఇలాంటి వ్యక్తులను పార్టీలో ఎలా కొనసాగిస్తున్నారని తాను ప్రధానిని అడుగుతున్నానని ప్రశ్నించారు. సామాజిక న్యాయం తీసుకువస్తానని ప్రధాని చెబుతుంటారని, మరోవైపు వారి నేతల మనస్తత్వం ఇలా ఉందని ఖర్గే ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్న నేతలు ఇలా మాట్లాడటం తనను బాధించిందని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఉభయ సభల్లో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు పార్లమెంట్‌లోని తన ఛాంబర్లో కేంద్ర మంత్రులతో ప్రధాని మోడీ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. దీనికి హౌం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సహా మంత్రులు ప్రహ్లాద్ జోషి, అనురాగ్ ఠాకూర్, నితిన్ గడ్కరీ, అర్జున్ రామ్ మేఘ్వాల్ హాజరయ్యారు. అలాగే మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో ఇండియా ఫోరం నేతల సమావేశం కూడా జరిగింది. పార్లమెంట్ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.