17 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు!

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జులై మూడో వారం నుంచి ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షత పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీపీఏ) సమావేశం జరగనుంది. అందులో ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశంలో సమావేశ తేదీలపై చర్చ జరగనుంది. జులై 17 ప్రారంభమై ఆగస్టు 10 వరకు సమావేశాలు జరగనున్నాయి.
ఈసారి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా జరగను న్నాయి. ఢిల్లీలో బదిలీ పోస్టింగ్‌ విషయంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు అధికారాలు ఇచ్చే బిల్లుపై మోడీ ప్రభుత్వం వ్యతిరేకతను ఎదుర్కోవలసి ఉంటుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దేశవ్యాప్తంగా తిరుగుతూ బీజేపీ వ్యతిరేక పార్టీలను కలుస్తూ ఈ విషయంపై మద్దతు కోరుతున్నారు.
కేజ్రీవాల్‌ బిల్లును వ్యతిరేకించా లని కాంగ్రెస్‌ను కూడా కోరారు. యూనిఫాం సివిల్‌ కోడ్‌పై ప్రధాని మోడీ తాజా ప్రకటనపై పార్లమెంటు లో దుమారం రేగవచ్చు.
కొత్త పార్లమెంట్‌ హౌస్‌లో జరిగే మొదటి సెషన్‌ ఇదే కావడం గమనార్హం. దీనికి ఆతిథ్యం ఇవ్వడానికి కొత్త పార్లమెంట్‌ హౌస్‌ సిద్ధంగా ఉంది. మే 28న ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్‌ నూతన భవనాన్ని ప్రారంభించారు.