– హమాస్ పై ప్రశ్నకు ఇచ్చిన సమాధానం నాది కాదన్న మంత్రి మీనాక్షి లేఖి
– ఈ వ్యవహారంపై విచారణకు ప్రతిపక్షాలు డిమాండ్
న్యూఢిలీ : ప్రశ్నలకు నగదు కుంభకోణంలో తణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఎంపి మహువా మోయిత్రా బహిష్కరణకు గురైన ఒక రోజు తర్వాత , భారతీయ జనతా పార్టీ (బిజెపి) కపటత్వాన్ని బయటపెట్టే అంశం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఎవరో ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మహువా మొయిత్రాను దోషిగా నిర్ధారించి లోక్‌సభ నుంచి బహిష్కరించారు. హమాస్‌పై నిషేధానికి సంబంధించి పార్ల మెంటులో అన్‌స్టార్డ్ క్వశ్చన్‌కు ఇచ్చిన సమాధానం తాను ఇచ్చినది కాదని, పార్లమెంటుకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి చెబితే దానిని ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. దీనిపై విచారణ జరిపించాలని విదేశాంగ శాఖ కార్యదర్శిని ఆమె కోరినా ఫలితం లేదు. ఈ స్థితిలో పార్లమెంటును తప్పుదారి పట్టించిందెవరో తేలాలంటే దీనిపై తక్షణమే విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించారా, ఇందుకు సంబంధించి ఇజ్రాయెల్ నుండి భారత్‌పై ఏదైనా ఒత్తిడి వచ్చిందా అని కాంగ్రెస్ సభ్యుడు సుధాకరన్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి మీనాక్షి లేఖి పేరుతో ఇచ్చిన సమాధానంలో ఇలా పేర్కొన్నారు”ఒక సంస్థను ఉగ్రవాదిగా పరిగణించాలా లేదా అన్నది చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) ప్రాతిపదికగా నిర్ణయించబడుతుంది. ఏదైనా సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం సంబంధిత ప్రభుత్వ శాఖల నిబంధనల మేరకే జరుగుతుంది.” అని ఆకుకు అందని పోకకు పొందని రీతిలో ఆ సమాధానం ఉంది. బహుశా, ఈ వైఖరి పట్ల ఇజ్రాయిల్ అసంతప్తి వ్యక్తం చేసింది కాబోలు, ప్రశ్న అడిగిన ఒక రోజు తర్వాత లేఖి ఆ సమాధానంతో తనకు సంబంధం లేదని సంజాయిషీ ఇచ్చి మరో వివాదానికి తెర లేపారు. ”నేను ఆ ప్రశ్న , సమాధానంతో కూడిన ఏ పత్రంపైన సంతకం చేయలేదు,” అని ఎక్స్ (ట్విట్టర్)లో ఒక పోస్ట్‌కు బదులిచ్చారు.. ఆ వెంటనే లోక్‌సభ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రశ్నను అప్‌లోడ్ చేయడం గురించి మరో ట్వీట్ ఉంది. లేఖి ఆ సమాధానం సిద్ధం చేయకపోతే, ఎవరు చేశారు అని ఆ ట్వీట్‌లో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు లేఖి స్పందిస్తూ, ”విచారణ జరిపిస్తే అసలు దోషి ఎవరో తేలిపోతుంది” అని అన్నారు. ఆ తరువాత లేఖి విలేకరులతో మాట్లాడుతూ, ”నా ప్రమేయం లేకుండా ఈ ప్రశ్న సమాధానం ఇచ్చిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విదేశాంగ కార్యదర్శిని కోరాను.” అని చెప్పారు. ఇది ప్రభుత్వ వ్యవహారమని, దీంతో పార్టీకిి ఎలాంటి సంబంధం లేదని ఆమె సెలవిచ్చారు. లోక్‌సభ వెబ్‌సైట్‌లో కూడా ప్రశ్న ఎలా అప్‌లోడ్ చేశారనే ప్రశ్నకు ఆమె ఇలా అన్నారు, ఈ ప్రశ్నను తీసివేయమని విదేశాంగ కార్యదర్శిని కోరాను. ఒకసారి లోక్‌సభ వెబ్‌సైట్‌లో ఉంటే, దిద్దుబాటు చేయడానికి ముందు కొన్ని విధానాలు, సవరణలు అవసరమని ఆయన నాకు చెప్పారని లేఖి అన్నారు. ఆ వెంటనే విదేశాంగశాఖ ఒక వివరణ ఇస్తూ ”డిసెంబరు 8న లోక్‌సభలో ఓ అన్‌స్టార్డ్ క్వశ్చన్‌కు సమాధానం ఇచ్చిన మంత్రి పేరు వి మురళీధరన్‌కు బదులు పొరపాటున మీనాక్షి లేఖి అని వచ్చింది, ఈ సాంకేతిక లోపాన్ని అంతర్గతంగా పరిష్కరిస్తామని తెలిపింది. మీనాక్షి లేఖి అభిప్రాయానికి, విదేశాంగ శాఖకు చెందిన అధికారి ఇచ్చిన వివరణకు పొంతన కుదరడం లేదు. మోడీ ప్రభుత్వం నిర్ణయాలు చేస్తున్న తీరు, ఆయన కేబినెట్ మంత్రులకే వాటిపట్ల స్పష్టత కొరవడిందనేది దీనిని బట్టి స్పష్టమవుతోంది. దీనిపై కె. సుధాకరన్ ‘ది వైర్’తో మాట్లాడుతూ , ”కాంగ్రెస్ ఎప్పుడూ పాలస్తీనా పక్షాన నిలుస్తుంది. ఈ ‘ఫ్లిప్ ఫ్లాప్’ (ముందొక మాట వెనకొక మాట) పార్లమెంటరీ ప్రత్యేక హక్కును ఉల్లంఘించడమే కాదు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 ప్రకారం మంత్రి ప్రమాణ స్వీకార ఉల్లంఘన కూడా. ఇజ్రాయెల్, పాలస్తీనా విషయంలో బిజెపి ఎప్పుడూ సందిగ్ధ వైఖరినే కలిగి ఉంది. స్పష్టత కోసం చేసే ప్రయత్నంలో, ప్రశ్న ఉంచబడింది. ఇప్పుడు ఆమె సంతకం చేయలేదని చెప్పారు.శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా ఎక్స్‌పై కొన్ని ప్రశ్నలను లేవనెత్తారు. ”ఎవరో సమర్పించిన ప్రశ్నలను అడగడం నిన్న ఒక ఎంపీని బహిష్కరించడానికి దారితీసింది. ఈరోజు, ఒక మంత్రి పార్లమెంటులో ప్రశ్నకు ఇచ్చిన సమాధానానికి తన ఆమోదం లేదని చెప్పారు. దీనిపైనా విచారణ జరపాలి కదా? అని అన్నారు.హమాస్‌పై నిషేధం విధించాలని ఇజ్రాయెల్ భారత్‌ను కోరుతోంది ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాను నిషేధించడంతో భారత్ కూడా హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించాలని ఇటీవల రాయబారి నౌర్ గిలోన్ అన్నారు . హమాస్‌పై నిషేధించే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ఇజ్రాయెల్‌కు భారతదేశం సూచించిందా అని అడిగినప్పుడు, గిలోన్, ”మేము మా వైపు నుండి ఏమి చేయాలనుకున్నామో అది చేశామని చెప్పారు.