– తాండూరులో చిలుక వాగు ప్రక్షాళన జరిగేనా..?
– హడావిడి చేసి..అభివృద్ధి మరిచిన అధికారులు
నవతెలంగాణ-తాండూరు
తాండూరు పట్టణ కేంద్రంలో ఉన్న చిలక వాగు కబ్జా కోరల్లో ఇరుక్కుపోయింది. పట్టణ కేంద్రంలో ఉన్న చిలకవాగు బషీర్‌మియా తాండా నుంచి ప్రారంభమై సాయిపూర్, ఆదర్శనగర్, పాత కుంట, గ్రీన్ సిటీ, మిత్రానగర్, పాత తాండూరు, పంప్ హౌస్ మీదుగా కాగ నదిలో కలుస్తుంది. చిలుక వాగు సుమారు ఐదు కిలోమీటర్ల పొడవునా ఉంది. చిలక వాగు ఇరువైపులా 33 ఫీట్ల వెడల్పుతో ఉన్న చిలక వాగు ప్రస్తుతం కబ్జా కోరల్లో ఇరుక్కుపోయింది. చిలక వాగుపై సుమారు 100కు పైగా ఇండ్ల నిర్మాణాలు ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా వందల సంఖ్యలో ప్లాట్లు సైతం వెలిశయి. దీంతో పూర్తి స్థాయిలో చిలకవాగు కబ్జా కోరలతో ఇరుక్కుపోయింది. చిలక వాగు ప్రక్షాళన పనులు మూడు అడుగుల ముందుకు ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. చిలకవాగు ప్రక్షాళన కోసం రూ.16 కోట్ల నిధులు సైతం వచ్చాయని నాయకులు చెప్పుకొస్తున్నారు తప్ప పనులు మాత్రం కావడం లేదు. వర్షం పడితే చిలక వాగు ప్రక్షాళన అంటూ హడావిడి చేసే అధికారులు వర్షపు నీరు పోయిన తర్వాత అటు వెళ్లడం మానేశారు. తాండూరు పట్టణ కేంద్రంలో కొనసాగుతున్న చిలుక వాగు ప్రక్షాళన, పాత తాండూరు బ్రిడ్జి నిర్మాణం పనులు మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక అన్న రీతిలో కొనసాగుతుంది. తాండూరులో చిలక వాగు, పాత తాండూర్ రైల్వే బ్రిడ్జి హాట్ టాపిక్ గా మారాయి. వర్షాకాలం ప్రారంభంలోనే తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చిలకవాగు ప్రక్షాళన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్ని అడ్డంకులు వచ్చిన చిలక వాగు పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తాండూరు ఎమ్మెల్యే ఆదేశాలలో చేపట్టిన చిలుకవాగు ప్రక్షాళన రోజుకో మలుపు తిరుగుతోంది. హైదరాబాద్ రోడ్డు మార్గంలో నాలుగు రోజుల క్రితం చిలుకవాగులో పూడిక పనులు చేపట్టారు. అప్పట్లో బీజేపీ నేతలు చిలుక వాగును పాత కాలువ పద్ధతిలోనే తవ్వకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దీంతో రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులు సర్వే నిర్వహించారు. రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు సర్వేను చేపట్టారు. ఈ సర్వేలో చిలుక వాగు హైదరాబాద్ రోడ్డు మార్గం మొదలుకొని కోకట్ శివారులో ముగిసి కాగ్నా నదిలో కలుస్తుందని నిర్ధారించారు. గ్రామ నక్ష ఆధారంగా సర్వేనెంబర్ 36, 39, 41, 47, 48, 49, 52, 53, 57, 58, 59, 62, 63లలో చిలుక వాగు ప్రవాహం ఉందని గుర్తించారు.చిలుక వాగు ప్రవాహ మార్గంలో తమకు చెందిన పాట్లు, నిర్మాణాలు ఉన్నాయి. దీంట్లో చిలుక వాగు మార్గం లేదని తమకు అమ్మకాలు చేపట్టారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు అధికారులు, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి సకాలంలో చిలక వాగు ప్రక్షాళన పనులను పూర్తి చేయాలని పలువురు వేడుకుంటున్నారు.
చిలక వాగు ప్రక్షాళన పనులను పూర్తి చేయాలి
చిలకవాగు ప్రక్షాళన పనులను పూర్తి చేయాలి. వర్షం వచ్చినప్పుడు పట్టణంలో ఇండ్లు నీటిలో మునిగిపోతున్నాయి. చిలక వాగు అభివద్ధి కోసం నిధులు ఉన్నాయి అంటున్నారు తప్ప అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి పనులు ప్రారంభించాలి.
మిత్రునాయక్ బషీర్ మియా తాండ మాజీ సర్పంచ్