– గ్లోబల్ టెక్ సీఈఓల సదస్సులో ప్రధాని మోడీ
న్యూయార్క్ : భారతదేశ అభివృద్ధి పయనంలో భాగస్వాములు కావాలని గ్లోబల్ టెక్ సీఈఓలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచారు, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణతో సహా పలువురు సీఈఓలతో మోడీ భేటీ అయ్యారు. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్బవించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని దీన్ని అవకాశంగా తీసుకుని ఈ పయనంలో చేతులు కలపాల్సిందిగా పలు అమెరికా బహుళ జాతి కంపెనీల సీఈఓలను కోరారు. ఆదివారం వారితో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, తమ మూడవ పదవీ కాలంలో దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. దేశ ఆర్థిక, సాంకేతిక వృద్ధికి గల అవకాశాలను అందిపుచ్చుకుంటూ, భారత్‌లో సహ అభివృద్ధికి, సహ రూపకల్పనకు, సహ ఉత్పత్తికి చర్యలు తీసుకోవడం ద్వారా ప్రపంచానికి అవసరమైన వినూత్న ఆవిష్కరణలకు, సహకారానికి కంపెనీలు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. మేథో సంపత్తి హక్కుల పరిరక్షణకు, సాంకేతికరంగంలో వినూత్న చర్యలను ఆవిష్కరించేందుకు భారత్ కట్టుబడి వుందన్నారు. దేశంలో చోటు చేసుకుంటున్న ఆర్థిక పరివర్తనను ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఐటి రంగంలో, సెమీ కండక్టర్ల రంగంలో జరుగుతున్న పురోగతిని మోడీ ప్రముఖంగా వివరించారు. సెమీ కండక్టర్ తయారీలో అంతర్జాతీయ కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దాలని తమ ప్రభుత్వం ధృఢంగా భావిస్తోందన్నారు. న్యూయార్క్ ప్యాలెస్ హోటల్‌లో ఆదివారం జరిగిన ఈ సమావేశంలో 15 ప్రధాన కంపెనీల సీఈఓలు పాల్గొన్నారు. ఎఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్లు వంటి అత్యంత అధునాతన సాంకేతికతలపై ఈ కంపెనీలు పనిచేస్తున్నాయి.
పెట్టుబడులు పెడతాం
అంతర్జాతీయ సాంకేతిక ప్రధాన కేంద్రంగా భారత్ వృద్ధి చెందుతున్న తీరును సీఈఓలు ప్రశంసించారు. అద్భుతమైన మార్కెట్ అవకాశాలు, వినూత్నమైన విధానాలు ఇందుకు దోహదపడుతున్నాయన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి, సహకరించడానికి వారు ఆసక్తి కనబరిచారు. దేశంలో కొత్త సాంకేతికతలు అభివృద్ధిపరచడానికి అవకాశం కల్పించే స్టార్టప్‌ల్లో పెట్టుబడులకు అంగీకరించారు.