వరద సహాయక చర్యల్లో భాగస్వామ్యం కండి

– కార్మికులకు సీఐటీయూ పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వరద ప్రాంతాల్లో సహాయక చర్యల్లో కార్మికులు భాగస్వామ్యం కావాలని సీఐటీయూ పిలుపునిచ్చింది. శుక్రవారం ఈ మేరకు ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘హైదరాబాద్‌, వరంగల్‌ గ్రేటర్‌ కార్పొరేషన్లతో పాటు అన్ని జిల్లాల్లోనూ వరద ఉధృతితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు పారిశ్రామిక ప్రాంతాలు, కార్మిక నివాస వాడలు నీట మునిగాయి. లోతట్టు కాలనీల ఇండ్లు పూర్తిగా జలమయమయ్యాయి. భద్రాచలం, పినపాక, భూపాలపల్లి, ములుగు గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రజలు భయాందోళనలలో ఉన్నారు. ఇంకా రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది. ఈ నేపథ్యంలో సీఐటీయూ, అనుబంధ సంఘాల నాయకులు, కార్మికులు వరద ప్రాంతాల్లో సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలి’ అని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు తీసుకోవాలని, నష్టాన్ని అంచనా వేసి వరద బాధితులకు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.