– గల్ఫ్ ఓట్లపై ఆశలు
– ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నికలపై ప్రభావం
నవతెలంగాణ- సిరిసిల్ల: శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలకు విజయం సాధించడం ప్రతిష్టాత్మకంగా మారింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బరిలో నిలిచిన అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించే శక్తి గల్ఫ్ దేశాల్లోని ప్రవాసులకు ఉంది పొట్ట చేత పట్టుకుని ఉన్న ఊరిని కన్నవారిని కట్టుకున్న భార్యా పిల్లలను విడిచి వేల మైళ్ళ దూరం వెళ్లి ఎడారి దేశాల్లో శ్రమిస్తున్న వలస జీవులు వారి కుటుంబ సభ్యుల ఓట్లు ప్రస్తుత ఎన్నికల్లో ఎంతో కీలకమయ్యాయి గల్ఫ్ దేశాల్లోని వలస జీవులను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీల నేతలు ఆరాటపడుతున్నారు
ఎనిమిది నియోజకవర్గాల్లో ప్రభావం
గల్ఫ్ దేశాలైన దుబాయ్ మస్కట్ బెహరాన్ సౌదీ అరేబియా కత్తర్ కువైట్ దేశాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవారు సుమారు 1.20 లక్షల మంది ఉన్నారు వీరంతా ప్రస్తుత ఎన్నికల్లో ఓటర్లు కాగా వారి కుటుంబ సభ్యులు ఆత్మీయులు మరో ఐదు లక్షల మంది ఉంటారు ఈ లెక్కన గల్ఫ్ దేశాలకు చెందిన వలస జీవులు వారి కుటుంబ సభ్యులు ఎన్నికల్లో ప్రభావ శక్తిగా ఉన్నారు సిరిసిల్ల వేములవాడ కోరుట్ల జగిత్యాల ధర్మపురి మానకొండూర్ హుజురాబాద్ చొప్పదండి నియోజకవర్గాల్లో గల్ఫ్ వలస జీవులు అధికంగా ఉన్నారు. హైదరాబాద్ శంషాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం గణాంకాల ప్రకారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 2019లో 7544 మంది గల్ఫ్ లోని దేశాలకు వెళ్ళగా, 2020లో 7123 మంది, 2021లో 4930 మంది, 2022లో4176 మంది, 2023లో నవంబర్ నాటి వరకు3842 మంది గల్ఫ్ దేశాలకు వెళ్లారు ఎన్నికల సమయంలో వారు ఓటు హక్కు వినియోగించుకోకపోయినా కుటుంబ సభ్యులకు ఏ పార్టీకి ఏ గుర్తుకు ఓటు వేయాలో స్పష్టంగా ఫోన్ లో చెబుతారు గల్ఫ్ లోని వలస జీవులు కుటుంబ సభ్యులకు ఎన్నికల్లో వ్యవహరించే తీరుపై సంకేతాలు ఇవ్వడం ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనుంది.
స్వరాష్ట్రంలోనూ తీరని కష్టాలు
తెలంగాణ రాష్ట్రం వచ్చిన గల్ఫ్ కార్మికుల కష్టాలు తీరలేదు నిజానికి చదువు రానివారు అక్కడి భాష తెలియని వారు గల్ఫ్ దేశాలకు వెళ్లి అనేక ఇబ్బందులు పడుతున్నారు గల్ఫ్ ఏజెంట్ల మాయమాటలతో వివిధ దేశాలకు వెళ్తున్న కార్మికులు అక్కడ ఏజెంట్ చెప్పినట్లు ఏ ఒక్కటి లేక నానా కష్టాలు పడుతున్నారు అప్పులు చేసి వెళ్లి ఇంటికి వచ్చేందుకు భయపడుతూ వేతనాలు సరిగా రాక కష్టాలకు ఎదురుచూస్తున్నారు అనేక కారణాలతో ఏటా గల్ఫ్ దేశాల్లో 300 మంది జిల్లా వాసులు మరణిస్తున్నారు 792 మంది గల్ఫ్ దేశాల్లో చనిపోగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు 214 మంది ప్రాణాలు కోల్పోయారు శవం స్వగ్రామంలోని ఇల్లు చేరడం కష్టంగా ఉంది కోట్లాది రూపాయల విదేశీ మరక ద్రవ్యాన్ని దేశానికి అర్జించి పెడుతున్న గల్ఫ్ వలస జీవులపై కేంద్రా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వంలో ఎన్నారై విభాగం ఉన్న దానికి బడ్జెట్ లేక కార్యక్రమాలు ఏమి చేయడం లేదు దీంతో గల్ఫ్ కార్మికులు నిత్యం కష్టాలను అనుభవిస్తున్నారు
ఏది ఎన్నారై పాలసీ… గల్ఫ్ జీవుల దీవెనలు ఎవరికో….
గల్ఫ్ దేశాల్లోని వలస జీవులు మాత్రం తెలంగాణ ప్రవాసుల కోసం ప్రత్యేకమైన ఎన్ఆర్ఐ పాలసీని ప్రకటించాలని కోరుతున్నారు ప్రభుత్వంలో ఎన్నారై విభాగాన్ని ఏర్పాటు చేసి కమిషనర్ను నియమించాలని కోరుతున్నారు కేరళ తరహాలో ప్రత్యేక విభాగాలన్నీ ఏర్పాటు చేసి వలస జీవుల యోగక్షేమాలను సమీక్షించాలని కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అకారణంగా గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న వారిని న్యాయపరమైన సహకారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు చేతిలో డబ్బులు లేకుండా వీసా లేకుండా కళ్లివెళ్లి కార్మికులకు విమాన టికెట్లు అందించాలని కోరుతున్నారు గల్ఫ్ మోసాలను అరికట్టి నకిలీ ఏజెంట్ల పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రూ 100 కోట్లతో బడ్జెట్ కేటాయించి గల్ఫ్ వెళ్ళేవారికి వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వాలని వెళ్లి వచ్చిన వారికి స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఎన్ఆర్ఐ పాలసీ ఏర్పాటు కోసం ఏ పార్టీ స్పష్టత ఇస్తే ఆ పార్టీకి మద్దతు ప్రకటిస్తామని గల్ఫ్ దేశాల్లోని తెలంగాణ ప్రవాసుల సంఘాలు స్పష్టం చేశాయి ఈసారి ఎన్నికల్లో ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు పోటీ చేస్తూ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి గల్ఫ్ వలస కార్మికుల లు ఎన్నికల్లో ఎంతో కీలకమయ్యాయి వలస జీవుల దీవెనలు ఎవరికి ఉంటాయోనని ఆసక్తి సర్వత్రా ఉంది.
– గల్ఫ్ ఓటర్లు: దాదాపు1.20 లక్షలు
– గల్ఫ్ వెళ్లిన వారి కుటుంబ సభ్యుల ఓట్లు: దాదాపు 5 లక్షలు
– నాలుగున్నర ఏళ్లలో కొత్తగా గల్ఫ్ వెళ్లినవారు: 27615
– నాలుగున్నర ఏళ్లలో గల్ఫ్ దేశాల్లో మరణించిన వారు: 792
– ప్రభావిత నియోజకవర్గాలు: సిరిసిల్ల వేములవాడ కోరుట్ల జగిత్యాల ధర్మపురి మానకొండూర్ హుజురాబాద్ చొప్పదండి