నవతెలంగాణ-భువనగిరి రూరల్
రానున్న భువనగిరి పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టరు హనుమంతు కే జండగే కోరారు. సోమవారం నాడు ఆయన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై రాబోయే భువనగిరి పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా లొకేషన్ మార్పు కొరకు పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల సంఖ్యకు అనుకూలంగా కొత్త అనుబంధ పోలింగ్ కేంద్రాల మార్పులపై వివరించారు. ఓటరు నివాసానికి పోలింగ్ కేంద్రానికి మధ్య 2 కిలో మీటర్లకు మించి దూరం ఉన్న చోట పోలింగ్ కేంద్రం స్థలం మార్పుకు సంబంధించి 4 కొత్త అనుబంధ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. భువనగిరి, ఆలేరు, మునుగోడు (చౌటుప్పల్, నారాయణపూర్) నకిరేకల్ (రామన్నపేట), తుంగతుర్తి ( మోత్కూర్, అడ్డగూడూరు) నియోజక వర్గాలకు సంబంధించి 812 పోలింగ్ కేంద్రాలలో 3 పోలింగ్ కేంద్రాలు లొకేషన్ మార్పు చేయడం జరుగుతుందని, అలాగే 4 కొత్త అనుబంధ పోలింగ్ కేంద్రాల ఏర్పాటుతో హేతుబద్దీకరణ తరువాత 816 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించడం జరిగిందని తెలిపారు. ఈ అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించి గత ఫిబ్రవరి 24 తేదీన ముసాయిదా ఓటర్ల ప్రచురణ ప్రకారం మొత్తం 6 లక్షల 51 వేల 121 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.ఈ సమావేశంలో బహుజన సమాజ్ పార్టీ నుండి బట్టు రామచంద్రయ్య, సిపిఐ నుండి వై అశోక్, కాంగ్రెస్ నుండి ఎండి లయీఖ్ అహ్మద్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నాగేశ్వరచారి, డిప్యూటీ తహశీలుదారు సురేశ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.