– కార్మిక సంఘ నేతలు
– ”అసెంబ్లీ ఎన్నికలు- కార్మికుల మ్యానిఫెస్టో” అంశంపై సీఐటీయూ ఆధ్వర్యంలో సదస్సు
నవతెలంగాణ-మహబూబాబాద్
మహాబూబాబాద్ జిల్లాలో ఉక్కు, బైరటిస్, సున్నం పరిశ్రమల ఏర్పాటు గురించి రాజకీయ పార్టీలు మ్యానిఫెస్టోల్లో చేర్చాలని జాతీయ కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పెరుమాండ్ల జగన్నాథం భవనంలో సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ‘అసెంబ్లీ ఎన్నికలు- కార్మికుల మ్యానిఫెస్టో’ అంశంపై సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆకుల రాజు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రస్థాయి డిమాండ్లతో పాటు జిల్లా పరిధిలోని అనేక అంశాలపై చర్చించి వర్కర్స్ మేనిఫెస్టో రూపొందించారు. ఈ సందర్భంగా సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శులు కుంట ఉపేందర్, రేషపల్లి నవీన్, హెచ్ లింగన్న మాట్లాడారు. రాష్ట్రంలోనే ఒక్క పరిశ్రమ కూడా లేని జిల్లా మహబూబాబాద్ అని అన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, గార్లలో బైరటిస్ పరిశ్రమ, గంగారంలో సున్నం పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా అనేక ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు. జిల్లాకు కార్మిక శాఖ అధికారిని నియమించాలని, కేసముద్రంలో ఏఎల్‌ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, క్వారీ కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని, హమాలీ ట్రాన్స్‌పోర్ట్, స్ట్రీట్ వెండర్స్, మిర్చి తొడిమెలు తీసేటువంటి అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ, ఆశా, ఐకేపీ వీవోఏ, మధ్యాహ్న భోజన కార్మికులకు సామాజిక భద్రత చట్టాలు అమలు చేయాలని కోరారు. రాష్ట్ర జనాభాలో 30 శాతానికి పైగా ఉన్న కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలతో రూపొందించిన వర్కర్స్ మ్యానిఫెస్టోను పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులకు, రాజకీయ పార్టీల జిల్లా అధ్యక్షులకు అందజేస్తామని వెల్లడించారు. సమావేశంలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ సంఘాల జిల్లా నాయకులు కుమ్మరికుంట్ల నాగన్న, తోట శ్రీను, వాసం దుర్గారావు, నర్రా శ్రావణ్, దేవేందర్, బాబు, జబ్బార్ తదితరులు పాల్గొన్నారు.