కుక్కలకు పార్వో వైరస్‌..

కుక్కలకు పార్వో వైరస్‌..– పాల్తీ తండా గిరిజనుల భయాందోళన
–  నియంత్రించాలని అధికారులకు వినతి
నవతెలంగాణ -పెద్దవూర
గ్రామ సింహాలుగా పేరొందిన కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇప్పుడు ప్రజల పాలిట ప్రాణసంకటంగా మారాయి.. ఆ ప్రాంతవాసులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. కుక్కలు దాడి చేసి గాయపరచడం కాదు.. కుక్కలకు సోకిన వైరస్‌.. అక్కడిపజలను భయాందోళనకు గురిచేస్తోంది.
అక్కడున్న కుక్కలకు పార్వో అనే వైరస్‌ సోకింది. ఎక్కడ నుంచి వచ్చాయో కానీ పాల్తీతండాలో 70కి పైగా కుక్కలు వున్నాయి. అందులో దాదాపు 30 కుక్కలకు పైగా పార్వో వైరస్‌ బారిన పడ్డాయి. అవి కరిస్తే.. మనుషులకు కూడా వైరస్‌ ప్రబలుతోంది. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పరిధిలో 26 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో సుమారు 69 నుంచి 100 వీధి కుక్కలు ఉంటాయి. గ్రామాల్లో స్వేచ్ఛగా స్వైర విహారం చేస్తూ, కనబడిన వారిపై దాడి చేస్తున్నాయి. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు మృత్యువాతపడిన సంఘట నలున్నాయి. కొద్ది రోజుల కిందట కుక్కలు ఆవుదూడను చీల్చి చంపాయి. ఇదిలా ఉంటే కుక్కలకు వైరస్‌ ఉందని తేలడంతో ఆందోళన నెలకొంది.
పార్వో వైరస్‌ అంటే..
కుక్కలకు పార్వో అనేది కనైన్‌ పార్వోవైరస్‌-2 సీపివీటు వల్ల వచ్చే రక్తస్రావ గ్యాస్ట్రోఎంటెరిటిస్‌ యొక్క ఒక రూపం. అయినప్పటికీ, వివిధ జంతువులను ప్రభావితం చేసే ఇతర పార్వోవైరస్‌లు ఉన్నాయి. చాలా అరుదుగా సీపివీటు నవజాత, ముసలి కుక్కపిల్లలకు సోకినట్లయితే గుండె సంబంధిత లక్షణాలను తెలియజేస్తోంది. పార్వో వైరస్‌ ప్రబలితే చికిత్స చేయకపోతే 2 నుంచి 3 రోజుల్లో కుక్క పిల్ల చనిపోవచ్చు. కొన్ని కుక్కలకు శరీరంపై బొగ్గలు, చీము, రక్తం కారి ఒక కుక్క నుంచి మకొక కుక్కకు వ్యాపిస్తుంది. అలాంటి కుక్కను కుట్టిన దోమ మనుషులకు కుట్టడం వల్ల వారికీ ఈ వ్యాధి ప్రబలుతుంది. ప్రస్తుతం అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మండలంలోని పాల్తీ తండా గ్రామంలో ఈ వైరస్‌ వల్ల చాలామంది జ్వరాలు, నొప్పులతో బాధపడుతున్నామని వెంటనే సంబంధిత అధికారులు కుక్కల నియంత్రణ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
కుక్కల వల్లే వైరస్‌ జ్వరాలు వస్తున్నాయి..
మా గ్రామంలో దాదాపు 70 కుక్కలు వున్నాయి. అందులో సగానికి పైగా వైరస్‌ సోకింది. వాటికి బొబ్బలు, పుండ్లు ఏర్పడి రక్తం, చీము కారుతోంది. కుక్కల ను కుట్టిన దోమలు మనుషులను కుట్టడంతో చాలా మంది వైరస్‌ జ్వరాలు, నొప్పులతో బాధపడుతున్నారు.
పాల్తీ రఘు.. పాల్తీ తండా
కుక్కలను నియత్రించాలి
కుక్కలు మేక, గొర్రె పిల్లలను చీల్చి చంపుతున్నాయి. మనుషులపై ఎగబడుతున్నాయి. వాహనంపై వెళ్లే వారిపై వెంటాడి దాడి చేస్తున్నాయి. చిన్న పిల్లలు, మహిళల వెంటపడుతున్నాయి. అధికారులు స్పందించి కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలి.
నేనావత్‌ శ్రీను.. పాల్తీ తండా