కాంగ్రెస్ పార్టీ నుండి పసరా సర్పంచ్ రాము సస్పెండ్..

నవతెలంగాణ-గోవిందరావుపేట
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న పసర గ్రామ పంచాయతీ సర్పంచ్ ముద్ధ బోయిన రాము ను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం తొలగించినట్లు కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాం నాయక్ అన్నారు. బుధవారం మండలంలోని పసర గ్రామంలో పసర కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు బద్దం లింగారెడ్డి అధ్యక్షతన గ్రామ మెజారిటీ ప్రజల తీర్మానం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.కాంగ్రెస్ పార్టీ తరపున సర్పంచిగా గెలిచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నదున కాంగ్రెస్ పార్టీ పస్రా గ్రామ కమిటీ తీర్మాణం ప్రకారం పస్రా గ్రామ సర్పంచ్ ముద్దబోయిన రాము ని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ మండల కాంగ్రెస్ కమిటీ నాయకులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భముగా మండల నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ పదవిని గెలుచుకున్న ముద్దబోయిన రాము గెలిచింది మొదలు నేటి వరకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు, ఆదర్శాలకు అనుగుణంగా పని చేయకుండా, గ్రామ ప్రజల కోసం పని చేయకుండా, తన స్వంత నిర్ణయాలు తీసుకుని, ప్రతి పక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటాలు చేస్తుంటే కనీసం పోరాటాల్లో పాల్గొనకుండా ఇతర పార్టీల నాయకులకు మద్దతు ఇస్తూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని కుంటుపరిచినందున మండల కాంగ్రెస్ కమిటీ నాయకులు గ్రామ మెజారిటీ తీర్మానం మేరకు అతన్ని పార్టీ నుండి తొలగిస్తూ, అతని ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎవరైనా, ఏ హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు, ఆదర్శాలకు అనుగుణంగా పని చేయకపోతే పార్టీ నుండి తప్పకుండా తొలగిస్తారు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంగం అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి, జిల్లా నాయకులు కణతల నాగేందర్ రావు, పాలడుగు వెంకటకృష్ణ, పంగ శ్రీను, యాస సత్తిరెడ్డి, ఏనుగు సునీత, చొప్పదండి వసంత, అలుగుబెల్లి వెంకటస్వామి, మందాడి ఉత్తరయ్య, తిక్క దుర్గారావు తదితర నాయకులు పాల్గొన్నారు.