ఢిల్లీ బిల్లుకు ఆమోదం

– రాజ్యసభలో అనుకూలం 131, వ్యతిరేకం 102
– తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు
– మొరాయించిన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌
– చిట్టీలతో ఓటింగ్‌ ప్రక్రియ
నవతెలంగాణన్యూఢిల్లీ బ్యూరో
రాజ్యసభలో ఢిల్లీ పౌరుసేవల బిల్లు ఆమోదం పొందింది. బిల్లుపై ఓటింగ్‌ జరగగా, బిల్లుకు అనుకూలంగా 131, వ్యతిరేకంగా 102 ఓట్లు వచ్చాయి. దీంతో బిల్లు ఆమోదం పొందినట్లు డిప్యూటీ చైర్మెన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ వెల్లడించారు. ఢిల్లీ సీనియర్‌ ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీలకు సంబంధించిన అధికారాన్ని లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు అప్పగించే ఆర్డినెన్స్‌ స్థానంలో ఢిల్లీ సర్వీసుల బిల్లును కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ జరిగింది. ఢిల్లీ సర్వీసుల బిల్లును ఏం చేసైనా సరే సాధించాలని బీజేపీ అనుకుంటోందని, ఈ బిల్లు పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమని, ప్రజావ్యతిరేకమని కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ మను సింఘ్వి అన్నారు. ఏ విధంగానైనా బిల్లుకు ఆమోదం పొందడం ద్వారా ఢిల్లీ సర్వీసుల అధికారాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని బీజేపీ అనుకుంటోందని విమర్శించారు. ఇది రాష్ట్రాలు మరియు ఢిల్లీ ప్రజల ఆకాంక్షలపై నేరుగా జరుపుతున్న దాడిగా ఆయన పేర్కొన్నారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, సివిల్‌ సర్వీస్‌ అకౌంటబిలిటీ, అసెంబ్లీ ఆధారిత ప్రజాస్వామాన్ని ఉల్లంఘించడమే అవుతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ నేత పి. చిదంబరం మాట్లాడుతూ రాజ్యాంగ అంశాలు పక్కనపెడితే, ఈ బిల్లులో కమిటీ విషయాన్ని తెలుపుతానని అన్నారు. కమిటీలో ముగ్గురు సభ్యులు ఉంటారని, అందులో ముఖ్యమంత్రి, మరో ఇద్దరు కేంద్ర ప్రభుత్వం చేత నియమితులైన వారు ఉంటారని తెలిపారు. మెజార్టీ ఇద్దరు కేంద్రం నియమించినవారే కాబట్టీ వారి అభిప్రాయాలే నెగ్గుతాయని, ముఖ్యమంత్రి మాట చెల్లదని అన్నారు. అలాగే కమిటీ కోరం ఇద్దరని బిల్లులో పేర్కొన్నారని, అలాంటప్పుడు ముఖ్యమంత్రి లేకుండానైనా కమిటీ సమావేశం నిర్వహించుకోవచ్చని తెలిపారు. ఈ కమిటీ ప్రతిపాదనలు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆమోదిస్తారని, ఇది చాలా ప్రమాదకరమని అన్నారు.
25 ఏండ్ల వరుస ఓటములే కారణం: చద్దా
ఢిల్లీలో జరిగిన గత ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దారుణమైన ఓటమి చవిచూసిందని, ఆ కారణంగానే బీజేపీ ఈ బిల్లు తీసుకువచ్చిందని ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా ధ్వజమెత్తారు. 25 ఏండ్లుగా బీజేపీ గెలుపునకు దూరమైందని, కేజ్రీవాల్‌ ప్రభుత్వం కారణంగా మరో 25 ఏండ్లు తాము గెలువలేమనే విషయం బీజేపీకి బాగా తెలుసునని అన్నారు. ఆ కారణంగానే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ధ్వంసం చేయాలని బీజేపీ కోరుకుంటోందన్నారు. ఢిల్లీ సర్వీసుల బిల్లు ఒక ‘పొలిటికల్‌ ఫ్రాడ్‌’ అని, రాజ్యాంగ పాపమని, ఢిల్లీలో ప్రభుత్వ యంత్రాగాన్ని స్తంభింప చేయడానికి ఉద్దేశించినదని విమర్శలు గుప్పించారు. సమష్టి బాధ్యతను గుర్తుచేసే పార్లమెంటరీ సిద్ధాంతాలను బలహీనపరచడమే ఈ బిల్లు ఉద్దేశమని అన్నారు. కేంద్రం రాజ్యాంగ నేరానికి పాల్పడుతోందని విమర్శించారు. ఇప్పుడు ఆఫీసర్లు ఎవరూ ముఖ్యమంత్రి, మంత్రుల మాట వినే పరిస్థితి ఉండదన్నారు. ఈ చర్య ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలని తోసిరాజనడమేనని అన్నారు.
ఈ బిల్లుపై బికాష్‌ రంజన్‌ భట్టాచార్య (సీపీఐ(ఎం), పి. సంతోష్‌ కుమార్‌ (సీపీఐ), కె.కేశవరావు (బీఆర్‌ఎస్‌), వి.విజయసాయి రెడ్డి (వైసీపీ), పి.చిదంబరం (కాంగ్రెస్‌), తిరుచ్చి శివ (డీఎంకే), మనోజ్‌ కుమార్‌ ఝా, ఎ.డి సింగ్‌ (ఆర్‌జేడీ), డెరిక్‌ ఓబ్రెయిన్‌, సుఖేందు శేఖర్‌ రారు (టీఎంసీ), ఫౌజియా ఖాన్‌ (ఎన్‌సీపీ), జావేద్‌ అలీ ఖాన్‌ (ఎస్‌పీ), సంజరు రౌతు (శివసేన), అనీల్‌ ప్రసాద్‌ హెగ్డే (జేడీయూ), జోషి కె.మణి (కేసీఎం), వైకో (ఎండిఎంకె), మహువా మాంఝీ (జెఎంఎం), సస్మిత్‌ పాత్ర (బీజేడీ), ఎం. తంబిదొరై (అన్నాడిఎంకె), జికె వసన్‌ (టిఎంసిఎం), సుధాన్షు త్రివేది, రాధా మోహన్‌ దాస్‌ అగర్వాల్‌, మహేష్‌ జఠ్మలానీ, ఘనశ్యామ్‌ తివారీ, కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి, భూవనేశ్వర్‌ కలిట, అనిల్‌ జైన్‌, సురేంద్ర సింగ్‌ నగర్‌, కవితా పటిదర్‌ (బీజేపీ), కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథ్వాలే (ఆర్‌పీఐ), నామినేటెడ్‌ ఎంపిలు రంజన్‌ గొగోరు, అజిత్‌ కుమార్‌ భుయన్‌ మాట్లాడారు.
దేశ ప్రజలు మాకు అధికారం, హక్కు ఇచ్చారు.. అమిత్‌ షా
బిల్లుపై జరిగిన చర్చకు కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా సమాధానమిస్తూ, సుప్రీంకోర్టు ఉత్తర్వులను బిల్లు ఉల్లంఘించలేదని అన్నారు. ఢిల్లీలో ఎలాంటి అవినీతికి తావులేని పాలన అందివ్వడం, అవినీతిపై పోరాటమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఢిల్లీలో పోస్టింగుల బదిలీల విషయంలో గతంలో ఎలాంటి గొడవులు లేవని, ముఖ్యమంత్రులతో ఎలాంటి సమస్యలు ఉండేవి కావని అన్నారు. 2015లో ఒక ఆందోళన తరువాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, కేంద్రం తమ హక్కులను లాక్కోవాలని చూస్తోందంటూ కొందరు మాట్లాడారని అన్నారు. అయితే ఆ విధంగా చేయాల్సిన పని కేంద్రానికి లేదని, దేశ ప్రజలు తమకు అధికారం, హక్కు ఇచ్చారని చెప్పారు. ఈ బిల్లు స్పష్టమైన చెల్లుబాటని పేర్కొంటూ మాజీ సుప్రీం కోర్టు సీజేఐ, ఎంపీ రంజన్‌ గొగోరు ప్రసంగం చేస్తున్న సమయంలో సమాజ్‌ వాదీ పార్టీ నుంచి జయా బచ్చన్‌ , శివసేన (యూబీటీ) నుంచి ప్రియాంక చతుర్వేది, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) నుంచి వందనా చవాన్‌, టీఎంసీ ఎంపీ సుస్మితా దేవ్‌ రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేశారు. ఇప్పటికే ఈ బిల్లు లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది.
మొరాయించిన రాజ్యసభ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లు
బిల్లుపై ఓటింగ్‌కు ప్రతిపక్షాలు డిమాండ్‌ చేయగా, డిప్యూటీ చైర్మెన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ అనుమతించారు. అయితే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ ప్రక్రియ జరపాలని రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌కు సూచించారు. అయితే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లు మోరాయించడంతో చిట్టీలతో ఓటింగ్‌ నిర్వహించారు.