ప్రయాణికుల ప్రాణాలు గాలిలో…

ప్రయాణికుల ప్రాణాలు గాలిలో...– మద్యం మత్తులో పట్టుబడుతున్న లోకో పైలట్లు
న్యూఢిల్లీ : బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షలో పట్టుబడుతున్న లోకో పైలట్ల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. మద్యం మత్తులో రైళ్లు నడుపుతూ లక్షలాది మంది ప్రయాణికుల ప్రాణాలతో వారు చెలగాటం ఆడుతున్నారు. గడచిన ఐదు సంవత్సరాల కాలంలో మూడు రైల్వే జోన్లలో ఈ పరీక్షలు నిర్వహించగా 995 మంది విఫలమయ్యారు. వీరిలో మూడో వంతు మంది విధులు ముగించుకొని ఇంటికి వెళుతుండగా జరిపిన పరీక్షల్లో దొరికిపోయారు. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు వచ్చిన సమాధానంలో ఈ విషయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా రాజధాని న్యూఢిల్లీలో జరిపిన పరీక్షల్లో అత్యధికులు పట్టుబడ్డారు. దిగ్భ్రాంతి కలిగించే విషయమేమంటే న్యూఢిల్లీలో 471 మంది లోకో పైలట్లు బ్రీత్‌అనలైజర్‌ పరీక్షలో ఫెయిలయ్యారు. వీరిలో 181 మంది అంటే 38% మంది ప్యాసింజర్‌ రైళ్ల డ్రైవర్లే. క్యాబిన్‌లో ఉన్నప్పుడు డ్రైవర్లను పరీక్షిస్తే 189 మంది దొరికిపోవడం గమనార్హం.
ఆల్కహాల్‌పై నిషేధం అమలులో ఉన్న గుజరాత్‌లో సైతం 104 మంది డ్రైవర్లు బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షలో ఫెయిలయ్యారు. వీరిలో 41 మంది ప్యాసింజర్‌ రైళ్లు నడిపిన వారు. ఈ విషయంలో ముంబయి నగరం కొంచెం నయం. అక్కడ కేవలం 11 మంది లోకో పైలట్లు మాత్రమే పట్టుబడ్డారు. జబల్పూర్‌ రైల్వే డివిజన్‌లో ఇలాంటి కేసులేవీ నమోదు కాలేదు. భోపాల్‌ మాత్రం వివరాలు అందించేందుకు నిరాకరించింది. పశ్చిమ, ఉత్తర, పశ్చిమ మధ్య రైల్వే జోన్లలో ఈ పరీక్షలు నిర్వహించారు. విధి నిర్వహణలో ఉన్న వారు మద్యం సేవించకుండా చూసేందుకు అధికారులు తరచుగా బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షలు జరుపుతారు. పశ్చిమ రైల్వే డివిజన్‌లో 273 మంది లోకో పైలట్లు దొరికిపోయారు. వీరిలో 82 మంది ప్యాసింజర్‌ రైళ్లు నడిపిన వారు. రత్లాం డివిజన్‌లో అత్యధికంగా 158 కేసులు నమోదయ్యాయి. 2020 జనవరి నుండి ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకూ అహ్మదాబాద్‌లో 44 మంది, వడోదరలో 37 మంది, రాజ్‌కోట్‌లో 15 మంది, భావ్‌నగర్‌లో 8 మంది పట్టుబడ్డారు. గత ఐదు సంవత్సరాల్లో ఉత్తర రైల్వేకు చెందిన ఢిల్లీ డివిజన్‌లో ప్యాసింజర్‌ రైళ్లకు చెందిన 181 మంది లోకో పైలట్లు, గూడ్సు రైళ్లు నడిపిన 290 మంది డ్రైవర్లు మద్యం మత్తులో దొరికిపోయారు. మొరాదాబాద్‌లో ఇలాంటి కేసులు 138 నమోదు కాగా విధులు ముగించుకొని వచ్చిన 108 మంది పట్టుబడిపోయారు. లక్నో డివిజన్‌లో 17 మంది ఫెయిలయ్యారు. పశ్చిమ మధ్య రైల్వేలోని కోటా డివిజన్‌లో 40 మంది లోకో పైలట్లు పట్టుబడిపోయారు. మద్యం మత్తులో బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షలో దొరికిపోయిన వారందరి పైనా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని అధికారులు చెప్పారు. ఆల్కహాల్‌ స్థాయి పరిమితికి లోబడి ఉంటే వారిని డ్యూటీ చేయకుండా నిలువరించి, సర్వీసు రికార్డులో నమోదు చేస్తారు. ఆల్కహాల్‌ స్థాయి పరిమితిని దాటితే సర్వీసు నుండి తొలగిస్తారు.