బక్రీద్‌ పండుగపూటా పస్తులే

– ఐదు నెలల నుంచి జీతాల్లేక కాంట్రాక్టు ఉద్యోగుల ఇక్కట్లు
– కనికరం చూపని ఉర్దూ అకాడమీ కార్పొరేషన్‌
– ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఉద్యోగుల వేడుకోలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఉర్దూ అకాడమీలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు బక్రీద్‌ పండుగపూటా పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది. ఐదు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తమ రెక్కల కష్టాన్నానైనా గుర్తించాలని వేడుకున్నా కార్పొరేషన్‌ మాత్రం వారి పట్ల కనికరం చూపట్లేదు. దీంతో ఉద్యోగులు కుటుంబ పోషణ కోసం ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌లో 142 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారు 15 నుంచి 30 ఏండ్లుగా పనిచేస్తున్నారు. వారు జిల్లా మైనార్టీ కార్యాలయాల్లో, గురుకుల పాఠశాలల్లో, వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ కోర్టుల్లో, సబ్సిడీ లోన్ల మంజూరులో, రంజాన్‌, క్రిస్మస్‌ దుస్తుల పంపిణీల్లో గ్రూపు 1,2,3 శిక్షణా కేంద్రాల్లో, హరితహారం, ప్రజా పాలన, అన్ని రకాల ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్నారు. వారికి ప్రతినెలా రూ.5 వేల నుంచి రూ.8,500 వరకు మాత్రమే వేతనాలు అందుతున్నాయి. ఇవి కూడా సమయానికి రాక పోవటంతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. డిసెంబర్‌ నుంచి ఇప్పటివరకు జీతాలు చెలించక పోవటం వల్ల ఉద్యోగులకు కుటుంబ పోషణ భారంగా మారింది. ఒక్కొక్క ఉద్యోగికి 5 నుంచి ఆరు నెలల వరకు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఇంటి అద్దె, పిల్లల చదువులు, ఫీజులు, వైద్యం, నిత్యావసర వస్తువుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తున్నదని వారు ఆందోళన చెందుతున్నారు. వాటి కోసం ఉద్యోగులంతా అధికారులు చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. చివరకు సీఎంఓ కార్యాలయం నుంచి ఆదేశాలొచ్చినా.. మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
పెండింగ్‌ జీతాలు ఇప్పించాలి
ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నా కార్పొరేషన్‌ నిర్లక్ష్యం వల్ల పండుగ పూట పస్తులుండాల్సి వచ్చిందని తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమి కంప్యూటర్‌ కం లైబ్రరీ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు అఫ్సాన్‌ అబ్రార్‌, ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ అఖిల్‌ వాపోయారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇప్పటికైనా తక్షణం పెండింగ్‌ జీతాలను ఇప్పించాలని కోరారు. పండుగపూట పస్తులుండాల్సిన దుస్థితి వచ్చిందని వాపోయారు.