రిజర్వేషన్లపై పాట్నా హైకోర్టు తీర్పు బీసీలకు నష్టం

– బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీహార్‌లో ఎస్సీ, ఎసీ,్ట బీసీ, ఈబీసీ సామాజిక రిజర్వేషన్లు 50 శాతం దాటడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమనీ, కాబట్టి బీహార్‌ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సామాజిక రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్టు గురువారం పాట్నా హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆ తీర్పు బడుగు బలహీన వర్గాల వ్యతిరేకమని చెప్పారు. న్యాయస్థానాలు వెలువరించే తీర్పులో కూడా వివక్షత ఉంటుందడానికి పాట్నా హైకోర్టు తీర్పే నిదర్శనమన్నారు. ఎలాంటి గణాంకాలు లేకుండా, కమిషన్‌ సిఫార్సులు లేకుండా రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్‌ 10 శాతం రిజర్వేషన్లకు అనుకూలమైన తీర్పులు ఇస్తున్న కోర్టులు.. బడుగు , బలహీన వర్గాలకు సంబంధించిన తీర్పుల్లో మాత్రమే వ్యతిరేకంగా ఉండటం శోచనీయమన్నారు. అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించి మొత్తం రిజర్వేషన్లు 60 శాతం సీలింగ్‌ పరిమితి దాటంచినప్పుడు లేని అభ్యంతరం, ఇప్పుడెందుకని ప్రశ్నించారు. జనాభా దామాషా ప్రకారం వారికి న్యాయబద్ధంగా సామాజిక వాటా దక్కడం కోర్టులకు ఇష్టం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలు కావాలంటే మొదటగా హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియాకాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. దేశంలో సామాజిక రిజర్వేషన్లు రక్షించుకోవడానికి త్వరలోనే ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు దేశవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టి ఆగస్టు చివరి వారంలో ఢిల్లీలో రామ్‌ లీలా మైదానంలో 10 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహించి బడుగు బలహీన వర్గాల తడఖా ఎంటో చూపిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మెన్‌ కుందారం గణేష్‌ చారి, కన్వీనర్‌ ఉప్పరి శేఖర్‌, సగర బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్‌ ముదిరాజ్‌, విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్‌, యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాంకుర్మ, బీసీ ఫెడరేషన్‌ అధ్యక్షులు ఎస్‌ దుర్గ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.