– తెలంగాణలో పొత్తులపై చర్చ
నవతెలంగాణ…న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తు, సీట్ల సర్దుబాటు పై కేంద్ర హౌం మంత్రి అమిత్ షాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటి అయ్యారు. బుధవారం ఢిల్లీలోని కృష్ణ మీనన్ మార్గ్ లో అమిత్ షా నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ లు పాల్గొన్నారు. దాదాపు 45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాలపై చర్చ జరిగినట్టు తెలిసింది. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ … పవన్ కళ్యాణ్ ను కలిసి తెలంగాణలో బీజేపి మద్దతు ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే. అయితే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, సెటిలర్లు ఎక్కువగా ఉన్న, పాపులారిటీ ఉన్నప్రాంతాల్లో 32 సీట్లు తమకు కేటాయించాలని జనసేన పట్టుబడుతున్నట్లు తెలిసింది. కానీ బీజేపీ నుంచి కేవలం 10 స్థానాలు మాత్రమే బీజేపి కేటాయించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా… జససేన నుంచే పొత్తుపై విజ్ఞప్తి వచ్చిందని, ఆ దిశలో తెలంగాణలోనూ పవన్ కళ్యాణ్ ను మద్దతు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. అయితే ఈ పొత్తులపై త్వరలో స్పష్టత రానున్నట్టు నేతలు తెలిపారు.