– ఐటీడీఏ ఎదుట సీఐటీయూ నిరసన, డీడీకి వినతి
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన ఎమ్మెల్యేలు, మంత్రులకు ఒకటో తారీకున లక్షల్లో వేతనాలు పొందుతున్నారని, 17 నెలల గిరిజన సంక్షేమ శాఖలోని ఔట్సోర్సింగ్ కార్మికులు వేతనాలు లేక పస్తులుంటున్నారని సీఐటీయూ పేర్కొన్నది. ప్రభుత్వం మారితే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశించినప్పటికీ గత ప్రభుత్వం అనుసరించిన విధానాలనే కార్మికుల పట్ల ఈ ప్రభుత్వం కూడా అనుసరిస్తుందని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కె.బ్రహ్మాచారి విమర్శించారు. సోమవారం ఐటీడీఏ ఎదుట సీఐటీయూ గిరిజన సంక్షేమ శాఖ, పోస్ట్ మెట్రిక్ హాస్టల్, ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నాచేసి, డీడీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మాచారి మాట్లాడారు. గిరిజన సంక్షేమ శాఖ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్‌లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికుల ఆకలి బాధలు తీర్చాలని సీఎంకి విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. జీతాలు లేక కార్మికుల పస్తులు ఉంటున్నారని ఈ విషయాన్ని ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, సంక్షేమ శాఖ కమిషనర్, ఐటీడీఏ పీఓ ద్వారా ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం వేతనాలు చెల్లించకుండా గిరిజన కార్మికుల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తుందని సీఐటీయూ పేర్కొన్నది. జీవో నెంబర్ 60 ప్రకారం రూ.15600 వేతనం చెల్లించాలని కోరారు. క్యాటరింగ్ విధానాన్ని రద్దు చేయించి రాష్ట్ర ప్రభుత్వ ఔట్సోర్సింగ్ జీవో 60 ప్రకారం నేరుగా కార్మికుల ఎకౌంట్లో జీతాలు చెల్లించాలన్నారు. పీఎఫ్, ఈఎస్‌ఐ ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పోస్టల్ శాఖ ద్వారా రూ.10 లక్షల ప్రమాద బీమా సౌకర్యానికి కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం చేయకపోతే సమ్మె చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. క్యాటరింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన డీడీ మాట్లాడుతూ ఐటీడీఏ పీవోతో మాట్లాడి వేతనాల చెల్లింపుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పోస్టుమెట్రిక్ హాస్టల్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ నాయకులు చందా జలంధర్, రామ, తిరుపతమ్మ, జయ, స్వరూప, రాజేష్, రాజ్యలక్ష్మి, చందు మున్నా, సుభద్ర, శ్యామల, స్వరూప, తదితరులు పాల్గొన్నారు.