– ఎన్నికల్లో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయండి
– రవాణామంత్రికి టీఎస్‌ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్ బృందం వినతి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీకి ‘మహాలక్ష్మీ’ స్కీం సొమ్మును పూర్తిగా చెల్లించాలని టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) బృందం రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేసింది. బుధవారం ఫెడరేషన్ అధ్యక్షులు వీరాంజనేయులు నేతృత్వంలో ఉపాధ్యక్షులు సత్తరి కృష్ణ, కార్యదర్శి జీ రవీందర్‌రెడ్డి తదితరులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రుల్ని కలిసి వినతిపత్రాలు సమర్పించారు. 2024-25 వార్షిక బడ్జెట్‌లో ఆర్టీసీ అభివృద్ధి, కార్మిక సంక్షేమానికి అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు. ‘మహాలక్ష్మి’ మహిళలకు ఉచిత ప్రయాణం సొమ్మును మూడు నెలల ముందే ఆర్టీసీలో జమ చేయాలని సూచించారు. ఆర్టీసీని లాభనష్టాల కోణంలో కాకుండా ప్రజారవాణా సంస్థగా పరిగణించాలని కోరారు. మహాలక్ష్మి (మహిళలు ఉచిత ప్రయాణం) పథకం అమలు వల్ల నెలకు దాదాపు రూ.450 కోట్ల ఆదాయాన్ని ఆర్టీసీ భౌతికంగా కోల్పోతున్నదనీ, ఈ సొమ్ము సంవత్సరానికి దాదాపు రూ.5,400 కోట్లు అవుతుందని తెలిపారు. ఈ మొత్తం సొమ్మును రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించి, ప్రతి నెలా 5వ తేదీ నాటికి రీయింబర్స్‌మెంట్ చేయాలని కోరారు. అన్ని గ్రామాలకు బస్సులు నడిపేందుకు వీలుగా మూడువేల బస్సుల కొనుగోలుకు నిధులు కేటాయించాలనీ, ఫిట్‌నెస్ గడువు ముగిసిన బస్సుల స్థానంలో కొత్త బస్సుల కొనుగోలు కోసం దాదాపు రూ. 1,775 కోట్లు అవసరమనీ, ఆ సొమ్మును బడ్జెట్‌లో కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ అభివృద్ధికి వార్షిక బడ్జెట్లో మరో రెండు శాతం నిధులు కేటాయించాలనీ, గతంలో బడ్జెట్లో కేటాయించిన సొమ్ము మొత్తాన్ని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీపై విధిస్తున్న అన్ని పన్నులు రద్దు చేయాలనీ, సంస్థ అప్పుల్ని ప్రభుత్వ ఈక్విటీగా మార్పు చేయాలని కోరారు. 2013లో జరిగిన వేతన ఒప్పంద బకాయిలను 8.75 శాతం వడ్డీతో ఇప్పటి వరకు లెక్కించి చెల్లించాలనీ, కాంగ్రెస్ ఎన్నికల మానిఫెస్టోలో ప్రస్తావించినట్టు 2017, 2021 సంవత్సరాల వేతన ఒప్పందాలు చేసి, బకాయిలతో వాటిని నగదుగా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఉద్యోగులకు సంస్థ బకాయిపడిన 173 నెలల కరువు భత్యం చెల్లించాలనీ, క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీకి ఇవ్వాల్సిన దాదాపు రూ.1,200 కోట్లు ఇవ్వాలనీ, యాజమాన్యం వాడుకున్న పీఎఫ్ ట్రస్ట్ నిధులు రూ.1,400 కోట్లు సొమ్మును జమ చేయాలని కోరారు. ఎస్‌ఆర్‌బీఎస్. ఎస్‌బీటీ నిధులను ఆయా ట్రస్టులకు చెల్లించాలని డిమాండ్ చేశారు.