పెండింగ్ ఉపాధి హామీ బిల్లులను చెల్లించాలి

Pay pending employment guarantee bills– టీ ఏ జి ఎస్ జిల్లా కార్యదర్శి గొంది రాజేష్
నవతెలంగాణ – గోవిందరావుపేట
గత కొంతకాలంగా ఉపాధి కూలీలకు చెల్లించకుండా పెండింగ్లో ఉన్న కూలీ బిల్లులను వెంటనే చెల్లించాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి గొంది రాజేష్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో జవహర్ రెడ్డికి ఈ మేరకు పెండింగ్ ఉపాధి హామీ బిల్లులను చెల్లించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో జరిగిన ఉపాధి హామీ పనులకు సంబందించిన బిల్లులను వెంటనే చెల్లించాలని, వేసవిలో తీవ్రమైన ఎండలను లెక్కచేయక ఉపాధి హామీ పనులు చేసిన వారికి మూడు నెలలు గడిచినా ప్రభుత్వం ఇప్పటి వరకు డబ్బులు చెల్లించక పోవడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికే కేంద్రం నుండి నిధులు తక్కువగా వస్తున్నాయని  తెలిపుతూ వచ్చిన నిధులనుండైనా పనికి తగ్గ వేతనాలు సకాలంలో చెల్లించకపోవడం ప్రభుత్వ డొల్లతనానికి నిదర్శనం అన్నారు. పనిచేసి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ప్రభుత్వం నుండి కనీస స్పందన లేకపోవడం హాస్యాస్పదం అంటూ ఇపుడైనా ప్రభుత్వం స్పందించి కళ్ళు తెరిచి కూలీల సాధకబాధకాలను ఆలోచించి వెంటనే ఉపాధి కూలీలకు డబ్బులు చెల్లించాలని లేనియెడల తెలంగాణా ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో యువకులు చేరుకుల శ్రావణ్, గొంది నవీన్, గొంది వంశీ తదితరులు పాల్గొన్నారు.