గత రెండేళ్లుగా పెండింగ్ లో ఉన్న లెప్రసి, పల్స్ పోలియో డబ్బుల్ని వెంటనే చెల్లించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో పలువురు ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం దుబ్బాక మండల పరిధిలోని తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ ముధస్తర్ కి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు సీహెచ్.భాగ్యలక్ష్మి మాట్లాడారు. డిసెంబర్ 2 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో లెప్రసి సర్వే చేయాలని ఆశాలకు జిల్లా అధికారులు చెప్తున్నారని.. వెంటనే లెప్రసీ సర్వే కోసం ట్రైనింగ్ కూడా ప్రారంభించారని తెలిపారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆపాలని.. లెప్రసి,పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు చెల్లించిన తర్వాతనే కొత్త సర్వేలు చేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 2023 లో సగం జిల్లాలకు, 2024 లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఆశాలు చేసిన లెప్రసి సర్వే డబ్బులు,2024లో చేసిన పల్స్ పోలియో డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం నేటికీ ఆశాలకు చెల్లించలేదని ఆరోపించారు. ఇదే విషయమై కమిషనర్ ఆఫీస్ లో సంబంధిత అధికారులను ఆశా యూనియన్ ఆధ్వర్యంలో కలిసినప్పుడు రెండేళ్ల లెప్రసి సర్వే డబ్బులు రిలీజ్ చేసి చాలా కాలమైందని, సర్వేకు ముందే ఈ బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగిందని చెప్పారని గుర్తు చేశారు. బడ్జెట్ వివరాలతో కూడిన సంబంధిత ప్రొసీడింగ్ ఆర్డర్స్ అందజేశారని, ఈ ఆర్డర్ కాపీలు తీసుకొని అన్ని జిల్లాల్లో తమ నాయకత్వం జిల్లా డీఎంహెచ్ఓ లను కలిసి పెండింగ్ లెప్రసి సర్వే డబ్బులు చెల్లించాలని కోరడం జరిగిందన్నారు. తమకు ఎలాంటి డబ్బులు రాలేదని, ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చినంత మాత్రాన డబ్బులు ఇచ్చినట్టు కాదని జిల్లా అధికారులు అంటున్నారని..ఈ అంశాన్ని రాష్ట్రస్థాయిలో సంబంధిత అధికారులకు తెలియజేసినా తమది కాదంటే తమది తప్పు కాదని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిరువురి మధ్య రాష్ట్ర వ్యాప్తంగా ఆశాలు గందరగోళానికి గురవుతున్నారని విమర్శించారు. పైగా రెండేళ్ల నుండి చేసిన లెప్రసి సర్వే ,2024లో చేసిన పల్స్ పోలియో డబ్బులు రాక ఆశాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి చేసిన పనికి డబ్బులు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తూ, ఇప్పుడు మళ్లీ కొత్తగా లెప్రసి సర్వే చేయాలని ఒత్తిడి చేయడం ఎంతవరకు సమంజసమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పై అంశాలు పరిశీలించి, వెంటనే పరిష్కారం కోసం కృషి చేయాలని, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.ఆశా వర్కర్లు శారద,మణెమ్మ,స్వరూప, చంద్రకళ,సంతోష,రేణుక,అనిత,విజయ,నాగరాణి,శ్యామల, తదితరులున్నారు.