ఉపాధ్యాయ పదోన్నతులపై ప్రత్యేక శ్రద్ధ వహించండి

– 2010 కంటే ముందు నియామకమైన టీచర్లకు టెట్‌ అవసరం లేదు
– హైకోర్టు అనుమతి ఇవ్వకుంటే ఐదేండ్లలో టెట్‌ అర్హత పొందేలా చూడాలి : మంత్రి సబితకు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉపాధ్యాయుల పదోన్నతుల సమస్య పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డికి గురువారం ఆయన లేఖ రాశారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పదోన్నతులపై భర్తీ చేసే స్కూల్‌ అసిస్టెంట్‌, తత్సమాన పోస్టుల్లో పదోన్నతి పొందడానికి టెట్‌ పేపర్‌-2 ఉత్తీర్ణత ఉండాలన్న హైకోర్టు తీర్పుపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. స్కూల్‌ అసిస్టెంట్‌, తత్సమాన పోస్టుల్లో ఇప్పటికే విద్యాశాఖలో పనిచేస్తున్న ఎస్జీటీ, తత్సమాన క్యాడర్‌ వారు పదోన్నతులు పొందేందుకు టెట్‌ పేపర్‌-2 అర్హత ఉండాలంటూ హైకోర్టు తీర్పు ఇచ్చినట్టు వార్తా పత్రికల్లో వచ్చిందని తెలిపారు. ఎన్‌సీటీఈ ఉత్తర్వుల ప్రకారం 2010 తర్వాత ఉపాధ్యాయ నియామకాల్లో టెట్‌ను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. అందువల్ల రాష్ట్రంలో 2010 కంటే ముందు ఉపాధ్యాయులుగా నియమింపబడిన వారు టెట్‌ పరీక్ష రాయలేదని గుర్తు చేశారు. ఇప్పుడు పదోన్నతుల ద్వారా భర్తీ అయ్యే పోస్టుల్లో 2010 కంటే ముందు ఎస్జీటీ, తత్సమాన పోస్టుల్లో నియమించబడిన వారే పదోన్నతి పొందుతారని వివరించారు. ఈ సమస్య పరిష్కారానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించాలనీ, హైకోర్టు తీర్పును పరిశీలింపజేయాలని సూచించారు. తీర్పు సారాంశం టెట్‌ పేపర్‌-2 అర్హత పొందడం తప్పనిసరి ఉంటే హైకోర్టు స్పెషల్‌ పిటిషన్‌ వేయాలని కోరారు. 2010 కంటే ముందు నియమించబడిన ఉపాధ్యాయులు టెట్‌ పేపర్‌-2 అర్హత అవసరం లేదనే అనుమతిని హైకోర్టు నుంచి తీసుకోవాలని తెలిపారు. కోర్టు ఆ ప్రతిపాదనను కాదంటే పదోన్నతి తర్వాత ఐదేండ్లలో టెట్‌ పేపర్‌-2 అర్హత సాధిస్తారన్న ఆదేశాలను పొందాలని సూచించారు. ఐఏఎస్‌ నుంచి గ్రూప్‌-2 అధికారుల వరకు వారి ఉద్యోగానికి అవసరమైన పరీక్షలు అర్హత పొందడానికి, ఉద్యోగంలో చేరిన తర్వాతే అవకాశమిస్తున్నారని పేర్కొన్నారు. హైకోర్టులో కేసు రాత్రికి రాత్రే వేస్తే తెల్లారేసరికి తీర్పు వచ్చేది కాదని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ సంచాలకుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి తీర్పులు వస్తాయని విమర్శించారు. ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌కు సరైన వివరణ ఇస్తే తీర్పు ఇలా ఉండబోదని పేర్కొన్నారు. అందుకే విద్యామంత్రి ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.