లాభాలలో 35 శాతం వాటా కార్మికులకు చెల్లించండి

లాభాలలో 35 శాతం వాటా కార్మికులకు చెల్లించండి– సీఎండీకి వినతి పత్రం ఇచ్చిన ఏఐటీయూసీ నాయకులు
నవతెలంగాణ-గోదావరిఖని:
సింగరేణికి 2023-24 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన నికర లాభాల నుంచి ప్రోత్సాహం కింద 35 శాతం వాటా కార్మికులకు, ఉద్యోగులకు చెల్లించాలని సీఎండీ బలరాం నాయక్‌కు సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) గుర్తింపు సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజకుమార్‌లు వినతి పత్రం అందజేశారు. శుక్రవారం హైదరాబాద్‌ సింగరేణి భవన్‌లో సీఎండీకి వినతిపత్రం ఇచ్చిన అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణిలో గత 24 సంవత్సరాలుగా బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడం ద్వారా సంస్థ లాభాలను ఆర్జిస్తుందని వారు తెలిపారు. సింగరేణిలో ఉద్యోగులు, సూపర్‌వైజర్‌లు, అధికారులు, కార్మిక సంఘాలు చేసిన సమష్టి కృషి వల్ల బొగ్గు ఉత్పత్తి సాధ్యమైందని వారు పేర్కొన్నారు. సింగరేణిలో 2023-24 సంవత్సరానికి 70 మిలియన్‌ టన్నుల సాధించగలమని, కంపెనీ ద్వారా అధిక లాభాలను కూడా ఆర్జింస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా సింగరేణిలో 2022-23 ఆర్థిక సంవత్స రంలో 67.14 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించిందని, 2222.46 కోట్ల లాభాలను ఆర్జించిందని వారు గుర్తు చేశారు. గత ముఖ్యమంత్రి, ప్రభుత్వం కంపెనీ ఆర్జించిన పన్ను తర్వాత లాభాలలో 32 శాతం వాటాను యూనియన్‌ నాయకులు చేసిన డిమాండ్‌ మేరకు ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక ప్రోత్సాహకంగా అక్టోబర్‌ 16, 2023న బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లించారని వారు పేర్కొన్నారు. సింగరేణిలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి 70 మిలియన్‌ టన్నులకు చేరుకునే అవకాశం ఉందని, అత్యధిక లాభాలను కూడా వచ్చే అవకాశం ఉందని వారు తెలిపారు. రాబోయే సంవత్స రాల్లో మరింత ఉత్పత్తి, ఉత్పాదకతను పెంపొందించడానికి వారిని ప్రేరేపించేందుకు ఉద్యోగులకు, సిబ్బందికి ప్రత్యేక ప్రోత్సాహకం కింద నికర లాభాలలో కనీసం 35 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రకటించడానికి ఏర్పాట్లు చేస్తూ వెంటనే చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కేంద్ర ఉపాధ్యక్షులు వంగ వెంకట్‌ తదితరులున్నారు.