– అదే బాటలో ఐరోబాట్
వాషింగ్టన్ : ఆర్ధిక మందగమనం, వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా పలు టెక్ కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపించడానికి వరుస కడుతున్నాయి. తాజాగా ఫైనాన్సీయల్ టెక్నాలజీ దిగ్గజం పేపాల్ ప్రపంచ వ్యాప్తంగా 9 శాతం ఉద్యోగులపై వేటు వేయాలని నిర్ణయించింది. దీంతో సుమారు 2,500 మంది ఉద్యోగాలు రోడ్డున పడనున్నారు. తొలగింపులకు సంబంధించి ఉద్యోగులకు కంపెనీ సిఇఒ అలెక్స్ క్రిస్ ఇ-మెయిల్‌లో సమాచారం ఇచ్చారు. ఉద్యోగాలు కోల్పోతున్న వారికి ఈ వారాంతంలో సమాచారం అందజేస్తామని స్పష్టం చేశారు. కంపెనీలో డూప్లికేషన్ తగ్గించడం, వనరులను సమర్థంగా వినియోగించడం, ఆటోమేషన్ వినియోగంతో సంక్లిష్టతలు తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. అభివృద్థికి అవకాశం ఉన్న విభాగాల్లో తమ పెట్టుబడులు కొనసాగిస్తామన్నారు.
ఐరోబోట్‌లో 31% మంది ఇంటికి..
రోబోటిక్ వ్యాక్యుమ్ క్లీనింగ్ సొల్యూషన్స్ అందించే ఐరోబోట్ తన సిబ్బందిలో 31శాతం మందికి ఉద్వాసన పలకనుంది. వృద్థి, లాభదాయకతను కొనసాగించేందుకు పునర్వ్యవస్ధీకరణ ప్రణాళికల్లో భాగంగా కంపెనీలోని దాదాపు 350 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు ప్రకటించింది. ఆయా సిబ్బందికి పరిహార ప్యాకేజ్ వర్తింప చేస్తున్నట్లు పేర్కొంది. ఇటీవల కాలంలో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, లింక్డిన్, మెటా తదితర దిగ్గజాలు ఒక్కొక్కటిగా ఉద్యోగుల తొలగింపునపై బాంబులు పేల్చుతున్న విషయం తెలిసిందే. అదే బాటలో మరిన్ని సంస్థలు నడుస్తున్నాయి. బడా కంపెనీల బాటలోనే చిన్న, మధ్యస్ధాయి సంస్ధలు సైతం ఉద్యోగులను వదిలించుకుంటున్నాయి. గతేడాదిగా కొనసాగుతున్న ఉద్వాసనలతో ఈ రంగంలో పని చేస్తున్న టెకీలు తీవ్ర ఆందోళనకు గురైతున్నారు. కాగా.. ఆయా కంపెనీలు భారీ ఆదాయాలు, లాభాలు సాగిస్తున్నప్పటికీ.. మరింత పొదుపు చర్యల్లో భాగంగా సిబ్బందిపై వేటు వేయడం గమనార్హం.