– భారీగా మనీలాండరింగ్..!
– రూ.వందల కోట్ల అనుమానిత లావాదేవీలు
– ఒక్క పాన్ కార్డ్‌తో అనేక ఖాతాలు
– 2021లోనే ఆర్‌బిఐ హెచ్చరిక
– పడిపోతున్న షేర్ విలువ
న్యూఢిల్లీ : పేటియం పేమెంట్ బ్యాంక్ ఫిబ్రవరి 29 తర్వాత మూతపడొచ్చని రిపోర్టులు వస్తోన్నాయి. విజరు శేఖర్ శర్మకు చెందిన ప్రముఖ డిజిటల్ చెల్లింపుల వేదిక పేటియం ద్వారా భారీ మొత్తాల్లో మనీలాండరింగ్ జరిగిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల పేటియంకు చెందిన పేటియం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పిపిబిఎల్)పై ఆర్‌బిఐ వేటు వేసిన విషయం తెలిసిందే. నో యువర్ కస్టమర్ (కెవైసి) నిబంధనలు పాటించకుండా మానీలాండరింగ్‌కు తావిచ్చిందని సమాచారం. పిపిబిఎల్ ద్వారా వందల కోట్ల రూపాయల సందేహాస్పద లావాదేవీలు జరగడంతోనే ఆర్‌బిఐ తీవ్ర చర్యలకు పాల్పడిందని రాయిటర్స్ ఓ కథనం ప్రచురించింది.
పేటియం పేమెంట్స్ బ్యాంక్ కొత్త ఖాతాదారులను తీసుకోకూడదని ఆర్‌బిఐ ఆదేశించింది. ఫిబ్రవరి 29 నుంచి అదనపు డిపాజిట్లు, రుణ లావాదేవీలు, టాప్ అప్‌లు లేదా కస్టమర్ అకౌంట్‌లు, ప్రీపెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్‌లు, వాలెట్‌లు, ఫాస్ట్‌ట్యాగ్ తదితర వాటిలో ఏవైనా సంబంధిత లావాదేవీలను నిలిపివేయాలని ఆదేశించింది. వడ్డీ, క్యాష్‌బ్యాక్‌లు లేదా రీఫండ్‌లను క్రెడిట్ చేయడం వంటి వాటికి మాత్రమే మినహాయింపు కల్పించింది. దీనర్థం ఖాతాదారులు ప్రస్తుత డిపాజిట్లను ఉపసంహరించుకోవడం సహా.. ఫిబ్రవరి 29 వరకు వారి వాలెట్‌లలో నిల్వ చేసిన డబ్బుతో సేవలను ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత లావాదేవీలను పూర్తిగా నిలిపివేయవచ్చని స్పష్టం అవుతోంది. ఈ పరిణామం పిపిబిఎల్‌పై నిషేధానికి దారి తీయొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
లక్షల సంఖ్యలో తప్పుడు కెవైసి ఖాతాలున్నాయి. కొన్ని వేల సందర్బాల్లోనూ ఒకే పాన్ కార్డును బహుళ ఖాతాలకు ఉపయోగించినట్లు తెలుస్తోంది. కనీస నియంత్రణ పరిమితిని మించి కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినట్లు.. ఇవి మనీలాండరింగ్‌కు దారి తీశాయని సమాచారం. పేటియం పేమెంట్స్ బ్యాంక్‌లో దాదాపు 35 కోట్ల ఇ-వాలెట్లు ఉన్నాయి. ఇందులో, దాదాపు 31 కోట్లు నిద్రాణంగా ఉన్నాయి. అయితే కేవలం 4 కోట్లు మాత్రమే బ్యాలెన్స్ లేదా చిన్న నిల్వలతో నిర్వహణలో ఉన్నాయి. కాబట్టి కెవైసిల్లో పెద్ద అవకతవకలు జరిగాయి. ఇది ఖాతాదారులు, డిపాజిటర్లు, వాలెట్ హోల్డర్లను తీవ్రమైన ప్రమాదానికి గురి చేసిందని ఓ అధికారి పేర్కొన్నారు. పేటియం పేమెంట్ బ్యాంక్‌లో 2021లోనే తీవ్రమైన కెవైసి, యాంటీ మనీ లాండరింగ్ ఉల్లంఘనలను గుర్తించింది. ఈ లోపాలను పరిష్కారించాలని ఆ సంస్థను ఆదేశించినప్పటికీ పక్కన పెట్టిందని సమాచారం. పిపిబిఎల్ సమర్పించిన దస్త్రాలు చాలా సందర్బాల్లో అసంపూర్తిగా, తప్పుగా ఉన్నట్లు రెగ్యూలేటర్ గుర్తించిందని తెలుస్తోంది. ఈ పరిణామాల వల్లే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సెప్టెంబర్ 2022లో పిపిబిఎల్, దాని మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్, ఇతర చెల్లింపు అగ్రిగేటర్‌ల ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించింది. ఇప్పటికీ ఆ సంస్థ వ్యవహారం మారకపోవడంతో అవసరమైతే, మనీలాండరింగ్ ఆరోపణలపై ఇడి మరింత దర్యాప్తు చేయొచ్చని ఓ అధికారి పేర్కొన్నారు. ఆర్‌బిఐ తాజా చర్యల పరిణామంతో కాగా రెండు రోజుల్లో పేటియం షేర్లు భారీగా క్షీణించాయి. శుక్రవారం సెషన్‌లో 20 శాతం కోల్పోయి రూ.487.20 వద్ద ముగిసింది. ఇంతక్రితం సెషన్‌లో రూ.608 వద్ద నమోదయ్యింది.