కృత్రిమ కొరత సృష్టిస్తున్న వారిపై పీడీ కేసులు

– విత్తనాలపై కలెక్టర్లకు సీఎస్‌ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో విత్తనాలను బ్లాక్‌ మార్కెట్లకు తరలించి, కృత్రిమ కొరతను సృష్టిస్తున్న వ్యాపారులపై పీడీ కేసులను నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లను ఆదేశించారు. వానాకాలం పంటలకు విత్తనాల సరఫరా, జూన్‌ 2న జరిపే రాష్ట్ర అవతరణ ఉత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో గురువారం ఆమె టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జీఏడీ, వ్యవసాయ శాఖల కార్యదర్శి రఘునందన్‌రావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ…ప్రస్తుత వానాకాలం సీజన్‌కు సంబంధించి గతేడాది కంటే అధిక మొత్తంలో వివిధ రకాల పంట విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామని తెలిపారు. విత్తనాలకు సంబంధించి ఆందోళన చెందొద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అధిక డిమాండ్‌ ఉన్న పత్తి, సోయా, మొక్కజొన్న హైబ్రిడ్‌ విత్తనాలు సరిపడా ఉన్నాయని అన్నారు. వీటితోపాటు జిలుగ విత్తనాలను కూడా కావాల్సినంతగా అందుబాటులో ఉంచామని తెలిపారు. వ్యవసాయ, రెవిన్యూ, పోలీస్‌ శాఖల అధికారులచే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విత్తన వ్యాపారుల గోదాములు, దుకాణాలను తనిఖీ చేయించాలని కలెక్టర్లను ఆదేశించారు. గోదాములు, విత్తన విక్రయ కేంద్రాలవద్ద పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను నియమించాలని సూచించారు. జూన్‌ మాసాంతం వరకు విత్తన విక్రయాలు కొనసాగే అవకాశం ఉన్నందున, జిల్లా కలెక్టర్లు ప్రతీ రోజూ ఈ అంశంపై సమీక్షించడంతోపాటు విధిగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి స్టాక్‌ రిజిస్టర్లు, పంపిణీ విధానాన్ని పరిశీలించాలన్నారు. రైతులతో సమావేశమై, సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయనే విధంగా వారిలో విశ్వాసం కల్పించాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి రైతులు వచ్చి ఇక్కడి విత్తనాలు కొనుగోలు చేయకుండా నివారించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. విత్తనాల లభ్యత సమాచారాన్ని రైతులకు ఎప్పటికప్పుడు తెలియ చేయాలన్నారు.
కలెక్టర్ల చేతుల మీదుగా పతాకావిష్కరణ
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్‌ రెండున రాష్ట్ర సాధన కోసం అమరులైన వారికి నివాళులర్పించిన అనంతరం… కలెక్టర్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని సీఎస్‌ తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయాల్లో నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను, ఇతర ప్రముఖులను, జిల్లా అధికారులను ఆహ్వానించాలని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగే కార్యక్రమానికి రావాలంటూ అమర వీరుల కుటుంబ సభ్యులకు, ఉద్యమ కారులకు జిల్లా కలెక్టర్ల ద్వారా ఆహ్వానం పంపుతున్నట్టు తెలిపారు.