
– టీయూలో 2017 నుంచి జరిగిన అన్ని నియామకాలు, ఆర్థిక లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపించాలి
నవతెలంగాణ-డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, తెలంగాణ యూనివర్సిటీని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద సోమవారం పత్రిక విలెకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పిడిఎఫ్ యూ జాతీయ యూనివర్సిటీల జాతీయ కన్వీనర్ ఎస్.నాగేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షులు పెద్దింటి రామకృష్ణలు మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీలో జరుగుతున్న వివాదాలను పరిష్కరించాలని, అక్రమ నియమకాలు, పదోన్నతులపై చర్యలు తీసుకోవాలని, యూనివర్సిటీలో అకాడమిక్ వాతావరణాన్ని పెంపొందించాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగానే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వాకటి కరుణ, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, నిజామాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి, ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాల ఉద్యమాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీసీ ప్రో.రవీందర్ గుప్తా పైన చర్యలు తీసుకోవడం, కమిషనర్ నవీన్ మిట్టల్ ను యూనివర్సిటీ బాధ్యతల నుంచి తప్పించడాన్ని మేము స్వాగతిస్తున్నామన్నారు. ఇదే స్పిరిట్ తో ప్రభుత్వం, అధికారులు ఉండాలని కోరారు. 2017 నుంచి తెవివిలో జరిగిన ఆర్థిక లావాదేవీలు, అక్రమ నియమాకాలు, పదోన్నతులపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీని ప్రక్షాళన చేసి, అకాడమిక్ వాతావరణాన్ని పెంపొందించాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, అన్ని రకాల ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ యూనివర్సిటీల రక్షణ, బలోపేతం కోసం, తె.యూలో జరిగిన అక్రమ నియామకాలు, పదోన్నతులు, లావాదేవీలపై సమగ్ర చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిడీఎస్ యూ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఎం.నరేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేష్ జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ జిల్లా నాయకులు వినోద్, సందీప్, సాయి, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.