ప్రశాంతంగా సెనగల్‌ అధ్యక్ష ఎన్నికలు

– బరిలో 17 మంది అభ్యర్థులు
డాకర్‌ : పశ్చిమ ఆఫ్రికా దేశమైన సెనగల్‌లో ఆదివారం అధ్యక్ష ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. దేశవ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 17 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అభ్యర్థులు ఎక్కువగా ఉన్నందున ఫలితాల వెల్లడికి ఎక్కువ రోజుల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే రెండో రౌండ్‌ జరిగే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. సెనగల్‌ అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలంటే కనీసం 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు రావాలి. వాస్తవానికి ఈ అధ్యక్ష ఎన్నికలు గత నెలలో జరగాలి. ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షులు మాకీ సాల్‌ కూడా ప్రధానంగా పోటీలో ఉన్నారు. ఇప్పటికే మాకీ సాల్‌ రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా పనిచేశారు. బిబివై కూటమి అభ్యర్థిగా మాజీ ప్రధాని, 62 ఏళ్ల అమడౌ బా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో మాకీ సాల్‌కు గట్టి పోటీ 44 ఏళ్ల బస్సిరౌ డియోమాయే ఫాయే నుంచి ఎదురువుతుందని భావిస్తున్నారు. గతవారమే ఫాయే జైలు నుంచి విడుదలయ్యారు. తిరుగుబాటు ఆరోపణలతో గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఫాయే నిర్భంధంలో ఉన్నారు. తనపై ఆరోపణలు రాజకీయ ప్రేరితమైనవని ఫాయే ఆరోపిస్తున్నారు. కాగా, ఈ ఎన్నికలతో దశాబ్దకాలం తరువాత తొలిసారిగా ఒక మహిళా పోటీ చేస్తున్నారు. ఎఆర్‌సి పార్టీ నుంచి 40 ఏళ్ల బాబాకర్‌ న్గోమ్‌ బరిలో ఉన్నారు.