శాంతి, సంఘ జీవన ప్రభోదం ‘మనుషులమై బ్రతకాలి’

”కవిత్వాన్ని ఆశ్వాదించలేకపోతే కోల్పోయేది ఏమీ లేదు. హృదయం తప్ప” అంటాడు జీన్‌ పాల్‌ సార్త్రే. ”జీవితానికి, జీవన అనుభవానికి ఆలంబన కవిత్వమే” అని నమ్మిన కవి దివాకరాచారి. నిద్రాణమైన జాతిని మేల్కొలిపే ప్రభావశీలి కవిత్వం అంటారు. దాదాపు 72 కవితలున్న ఈ సంపుటిలోని కవితలన్నీ ప్రగతిశీల దృక్పథంతో సాగినవే. డా||ఎన్‌.గోపి, డా||మద్దిపాటి కృష్ణారావు, డి.ఎల్‌.ఆర్‌.ప్రసాద్‌ లాంటి సాహితీవేత్తలు చక్కటి విలువైన ముందుమాటలు రాశారు. అసమానతల సమాజంలోని రుగ్మతలు, కన్నీళ్లు, కష్టాలు, అన్యాయాలు కవిత్వీకరిస్తూనే, మనిషిగా మానవత్వాన్ని పరిమళిస్తూ బతకాలని ఆరాటపడే మానవతావాది రాసిన మంచి గంధం ఈ కవిత్వం.
సహజీవనం, జన హననం, శ్రమైక జీవన పోరాటం, మనమూ ఓ చీపురు అవ్వాలి, అన్న దాతల ఆక్రోశం, విశ్వనరుడు నాన్న, ప్రాత: కాల స్వచ్ఛ దేవతలు, ఈ నగరానికి ఏమైంది?, దూదిపులి, కాగడాలై వెలగాలి, స్వచ్ఛాంకురం, బీజాక్షరాలవ్వాలి, అమ్మతనం లాంటి కవితలు కవిలోని భావస్పష్టత, సాంద్రత, చిక్కదనం కనిపిస్తాయి. కొన్ని కవితల్లో శ్రీశ్రీ, శివసాగర్‌లు కనిపిస్తారు. మచ్చుకు కొన్ని కవితలు చూద్దాం.
”ఎప్పుడైనా గుర్తుంచుకుని/ నన్ను కాస్త ప్రేమగా తడిమిచూడండి/ అమ్మలా మిమ్మల్ని గుండెకు ఆబగా ఆర్తితో హత్తుకుంటా” అంటుంది పుస్తకం (పేజీ.17).
దేశానికి కనిపించని వెన్నెముక ఉనికిని/ కార్పొరేట్‌ శక్తులకు అప్పనంగా అందించే కొత్త కుట్ర చట్టాలకు నిరసనగా/ ఎగసిన మౌన ఉప్పెనలై/ పాలకుల దిమ్మతిరిగేలా/ ఢిల్లీకోటను ముట్టడించిన రుద్రకృషీవలుల ఘర్షనలకు జతగా/ అందరం ఒక్కటై గొంతు కలపాలి (పేజీ.27) అంటారు అన్న(దాత)ల ఆక్రోశం కవితలో.
మిర్యాలగూడలో పరువు హత్యపై స్పందిస్తూ కవి ఎంతో ఆర్తితో ఒక చోట ఇలా రాశారు (పేజీ.30) ”పసుపు కుంకుమల్ని ఇచ్చి/ సంబరాలు చేయాలి కదా మరి ఈ నాన్నెందుకు/ కడుపుతో వున్న కూతురి నుదుటి కుంకుమను ఇలా చెరిపేశాడు ఎందుకు?” అంటారు. చంద్రయాన్‌ కాలంలోనూ ‘కులం’ దేశ దేహాన్ని వదలడం లేదు. సలీం అనార్కలి కాలాల నుండి అమృత – ప్రణరుల దాకా ఎందరో బలౌతున్నారు. మనిషి కేంద్రంగా సమాజం వుండాలని మానవతా వాదులు ఎప్పటి నుండో గొంతెత్తి ఘోషిస్తున్నారు. గుడిహళంపై రాసిన కవితలో చివరి వాక్యాల్లో కవి ఇలా రాశారు.
”ఎప్పుడో ఒకప్పుడు అందరం శవాలమై కనుమరుగవ్వాల్సిందే/ కానీ ఈ లోపే మనుషులమై బ్రతకాలి. మానవత్వాన్ని పరిమళించాలి. మనం నమ్మని మరో జన్మ నిజమై నీవన్న పునరపి జననంలా. ఒకసారి తిరిగి రావా రఘూ’? (పేజీ 109)… ఇలా చాలా కవితలు మానవీయ కోణాల్ని అద్భుతంగా ఆవిష్కరిస్తాయి. కవి తన వ్యక్తిత్వావరణలోకి పాఠకుల్ని చెయ్యిపట్టి చివరిపుట దాకా తీసుకెళ్లి ఆలోచింపజేస్తాడు. మీరూ ఆస్వాదించండి.
– తంగిరాల చక్రవర్తి, 9393804472