– ఖాతాలను సస్పెండ్ చేయాలిొ ఎక్స్‌ను ఆదేశించిన కేంద్రం
– ఇది భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి : ఎక్స్
న్యూఢిల్లీ : రైతుల సమ్మెకు సంబంధించిన పలు సోషల్ మీడియా ఖాతాలను సస్పెండ్ చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎక్స్‌ను కోరింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని ఖాతాలను నిషేధించామని ఎక్స్ తెలియచేసింది. అయితే ప్రభుత్వ చర్యను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపింది. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడేనని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల గురించి తమ గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ అకౌంట్ ద్వారా ఎక్స్ తెలియచేసింది.
కొన్ని ఖాతాలు, పోస్టులపై చర్య తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జారీ చేసింది. ఈ మేరకు తాము చర్యలు తీసుకోకపోతే జైలు శిక్ష విధించడంతో సహా జరిమానా కూడా వుంటుందని కేంద్రం తమని బెదిరించిందని ఎక్స్ తెలిపింది. ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా తాము రిట్ పిటిషన్ వేశామని, కానీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. చట్టపరమైన కారణాల కోసం బహిరంగంగా వెల్లడించడానికి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పరిమితం చేయబడిందని ఎక్స్‌్ ఆ పిటిషన్‌లో తెలిపింది. కానీ ప్రజలు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనే తాము ఈ సమాచారాన్ని పంచుకుంటున్నామని స్పష్టం చేసింది. ఎవరైతే ప్రభుత్వ చర్యలను ఎదుర్కొంటున్నారో వారికి కూడా ఈ సమాచారాన్ని పంపినట్లు తెలిపింది. రైతుల చలో ఢిల్లీ మార్చ్ పట్ల కేంద్రం దారుణమైన వైఖరి ప్రదర్శిస్తోంది. రైతులపై పోలీసులు జరిపిన దాడుల్లో ఒక యువ రైతు చనిపోయాడు. ఎంతకైనా తెగించి ఆందోళనలు, నిరసనలను అణచివేయాలన్న కేంద్ర వైఖరికి ఎక్స్ ఖాతాల తొలగింపు నిర్ణయం ఒక ఉదాహరణ అని ఎక్స్ పేర్కొంది.