రైతు ఉద్యమాలే కొరటాలకు నిజమైన నివాళి

రైతు ఉద్యమాలే కొరటాలకు నిజమైన నివాళికామ్రేడ్‌ కొరటాలగా అందరూ పిలుచుకునే ప్రియతమ నేత, సీపీఐ(ఎం) ఉమ్మడి రాష్ట్ర కమిటీ పూర్వ కార్యదర్శి, పోలిట్‌బ్యూరో మాజీ సభ్యులు, రైతు, వ్యవసాయ కార్మిక, చేనేత కార్మిక సంఘాల ఉద్యమ సారథి కొరటాల సత్యనారాయణ 18వ వర్థంతి జులై ఒకటి. ఆయన గుంటూరు జిల్లా అమృతలూరు మండలం ప్యాపర్రు గ్రామంలో 1923 సెప్టెంబర్‌ 24వ తేదీన భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. విద్యార్థి దశలోనే పద్నాలుగేళ్ల వయసులో డిటెన్షన్‌కు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థి ఉద్యమంతో ప్రజాజీవితంలోకి ప్రవేశించిన కొరటాల 2006 జులై 1వ తేదీన అనారోగ్యంతో మరణించే వరకు ఏడు దశాబ్దాల పాటు ఎర్రజెండా చేత పట్టుకుని అలుపెరుగని పోరాటం నిర్వహించారు. నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్బంధ కాలంలో నాలుగేండ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపారు. అజ్ఞాత జీవితంలో ఉండగా 1948లో అరెస్టు చేసి సుమారు మూడేండ్లకు పైగా బళ్లారి, కడలూరు జైళ్లలో నిర్బంధించారు. చల్లపల్లి జమిందారుకు వ్యతిరేకంగా జరిగిన భూపోరాటంలో, పేదల స్వాధీనంలో ఉన్న బంజరు భూముల పోరాటంలో ఆయనది ప్రత్యేక స్థానం. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని, కరువు నుండి రాయలసీమను విముక్తి చేసేందుకు, ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు మళ్లించాలని సాగిన పోరాటాల్లో చేసిన కృషి మరువలేనిది. రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు నివారించాలని, రైతులకు పంటలకు మద్దతు ధరలు కల్పించాలని జరిగిన ఉద్యమాల్లో కొరటాలది క్రియాశీలక పాత్ర.
రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా రాష్ట్రంలో కరువు, తుఫాన్‌ వంటి ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా బాధితుల పక్షాన నిలబడి ఉద్యమాలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన పత్తి రైతుల ఆత్మహత్యలపైన, వరి, పత్తి, కంది, మిరప, పొగాకు వంటి పంటలకు కనీస మద్దతు ధరల కోసం ఉద్య మాలు నిర్వహించారు. వ్యవ సాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకునిగా వ్యవసాయ కార్మికు లకు బంజరు భూములు పం చాలని, కూలి రేట్ల పెంపుదల, ఉపాధి వంటి సమస్యలపై ఉద్యమాలు నిర్వహిం చారు. చేనేత కార్మిక సంఘం బాధ్యుడిగా చేనేత కార్మికుల మజూరి, రంగుల ధరలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు వంటి సమస్యలపై ఎనలేని కృషి చేశారు. తాను ఏ రంగంలో పని చేసినా ప్రజాసమస్యల పరిష్కారం కోసం లోతైన అధ్యయనంతో ఉద్యమ నిర్మాణానికి కొరటాల కృషి చేశారు.
రైతు వ్యతిరేక విధానాలపై…
2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్ట పోయినట్లుగా బొటాబొటీ మెజారిటీతో, చంద్రబాబు, నితీష్‌కుమార్‌ వంటి మిత్రుల మద్దతుతో కేంద్రంలో బీజేపీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చింది. అయినా బీజేపీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం తన వెనుకటి విధానాల నుండి ఏ మాత్రం పక్కకు వైదొలగలేదన్నది స్పష్టమవుతున్నది. జూన్‌ 19న 2024-25 ఏడాదికి 14 రకాల వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వం అరకొరగా మద్దతు ధరలను ప్రకటించి రైతాంగం పట్ల తన వైఖరిని మరోమారు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలతో రైతాంగం క్వింటాలుకు వరి పైన రూ.712, కందులకు రూ.2,206, మినుములకు రూ.2,344, వేరుశనగకు రూ.1,713, పత్తికి రూ.2,224 నష్ట పోతున్నారు. వ్యవసాయ ఖర్చులు 18 శాతం నుండి 35 శాతం వరకు పెరుగుతుంటే మద్దతు ధరలు మాత్రం 5 నుండి 10 శాతం మాత్రమే పెంచారు. పెట్టుబడిపై 50 శాతం (సి2+50 శాతం) లాభం కలిపి పంటలకు మద్దతు ధర నిర్ణయించాలన్న డా||స్వామినాథన్‌ కమిటీ సిఫారసులను ఏ మాత్రం అమలు చేయకుండా పక్కన పెట్టిన ఘనత నరేద్రమోడీ సర్కార్‌దే.
రూ.20వేల వ్యవసాయ పెట్టుబడి సాయం, రూ.2 లక్షల వరకు పంట రుణాలు రద్దు, సున్నా వడ్డీ, పావలా వడ్డీ బకాయిల విడుదల వంటి ఎన్నికల హామీలను ఏపీలో టీడీపీ, తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అమలు చేయాలి. కేరళ తరహాలో రాష్ట్రంలో రైతు రుణ విమోచన చట్టం తీసుకురావాలి. పంటలకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలకు అదనంగా క్వింటాలుకు రూ.500 బోనస్‌ ప్రకటించి అమలు చేయాలి. కేంద్రం ప్రకటించని పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరలు ప్రకటించి అమలు చేయాలి. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి మార్కెట్‌ ఒడిదుడుకులలో రైతుకు అండగా నిలవాలి.
కార్పొరేట్‌ అనుకూల సాగు విధానాలు
నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం 2019లో తెచ్చిన మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ నిర్బంధాలను లెక్క చేయకుండా రైతాంగం పెద్ద ఎత్తున చారిత్రాత్మక ఉద్యమం నిర్వహించింది. దీంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఆ సందర్భంగా నరేంద్ర మోడీ స్వయంగా పార్లమెంటులో రైతులకు క్షమాపణలు చెప్పి మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంటున్నామని ప్రకటించారు. రైతుల ప్రతినిధులతో చర్చించి మద్దతు ధరలిచ్చేలా పార్లమెంటులో చట్టం తెస్తామని, విద్యుత్‌ సవరణ బిల్లు ఉపసంహరించు కుంటామని హామీనిచ్చారు. కాని ఆ చట్టాలను మరో రూపంలో అమలు చేస్తూ రైతు కేంద్రంగా ఉన్న మన వ్యవసాయాన్ని కార్పొరేట్‌ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నది. వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు అవసరమైన ఎఫ్‌సిఐ గిడ్డంగులను ప్రయివేట్‌ కార్పొరేట్‌ కంపెనీలకు ఇస్తున్నది. విద్యుత్‌ రంగంలో తెస్తున్న సంస్కరణలతో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ప్రశ్నార్థకం కానుంది. వ్యవసాయ రంగంపైనే కాక, గృహ విద్యుత్‌ వినియోగ దారులపైనా విపరీతంగా భారం పడే అవకాశం ఉంది.
వెంటాడుతున్న సమస్యలు
తెలంగాణలో తొలకరిలో కురిసిన వర్షాలకు రైతులు వ్యవసాయ పనులు చేపట్టారు. కానీ ఓవైపు అతివృష్టి, మరో వైపు అనావృష్టి అన్నట్టుగా వర్షపాతం నమోదవడంతో చాలా జిల్లాల్లో వేసిన విత్తనాలు మగ్గి పోయాయి. దీంతో మళ్లీ నాటాల్సి రావడంతో రైతులపై అదనపు భారం పడుతోంది. పైగా నకిలీ విత్తనాల బెడద రైతులను వెంటాడుతోంది. మేలో వచ్చిన తుఫాన్‌తో కొన్ని జిల్లాల్లో పండ్ల తోటలకు అపారనష్టం వాటిల్లింది. కంటితుడుపు చర్యగా ప్రభుత్వం పరిహారమిచ్చి చేతులు దులుపుకుంది. కానీ గతేడాది వర్షాల వల్ల యాసంగి ఐదు లక్షల ఎకరాలు దెబ్బతిన్నా ఇప్పటివరకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో రైతుబంధుతో కొంత ప్రయోజనం జరిగినప్పటికీ భూమికి పరిమితి లేకపోవడంతో భూస్వాములు, ధనిక రైతులు లబ్దిపొందారు. కౌలురైతులకు కూడా రైతుబంధు ఇవ్వాలనే డిమాండ్‌తో వ్యకాస, ఏఐకేఎస్‌ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపట్టారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సన్నవడ్లతో పాటు ఏడు పంటలకు బోనస్‌ ఇవ్వాల్సి ఉన్నా ఆ దిశగా ముందుకు సాగడం లేదు. ఇప్పటివరకు ”పంట రుణ ప్రణాళిక”ను ప్రకటించ లేదు. మేనిఫెస్టో ప్రకారం ఆగస్టు 15 నాటికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు అమలు చేయలేదు. రుణమాఫీ అవుతుందనే ఆశతో రైతులు బాకీలను చెల్లించలేదు. దీంతో బ్యాంకులు కొత్త పంట రుణాలివ్వకపోవడంతో మళ్లీ అధిక వడ్డీలకు ప్రయివేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది.
2021వ సంవత్సరం నుండి గత ప్రభుత్వం వ్యవసాయ ప్రణాళిక రూపకల్పన ఆపేసింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయ ప్రణాళికపై రైతు సంఘాలతో చర్చించింది. రైతు సంఘాలు అనేక సూచనలు చేశాయి. ప్రణాళిక లేకపోవడం వల్ల చాలామంది రైతులు వరి, పత్తి వైపు వెళ్తు న్నారు. మిగిలిన పంటలు వేయడానికి ముందుకు రావడం లేదు. వెంటనే వ్యవసాయ ప్రణాళికను రూపొందించి బహుళ పంటల విధానాన్ని అమలు చేయాలి.
దేశానికి అన్నం పెట్టే రైతులు ఇలా అనేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంటే ఆదుకోవాల్సిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేష్టలూడిగి చూస్తున్నాయి. కార్పొరేట్లకు అనుకూల మూడు నల్ల చట్టాల రద్దు విషయంలో రైతులు ఏవిధంగా ఉద్యమించారో అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులకు అండగా ఎన్నో పోరాటాలు నిర్వహించి రైతుల పక్షాన నిలిచిన కొరటాల స్ఫూర్తి నేటితరానికి ఆదర్శనీయం.