– వ్యవసాయోత్పత్తుల ప్రదర్శన వద్ద నిరసనలు
పారిస్: పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతుల ఆదాయం పెరిగేలా చూడాలని, వ్యవసాయ ప్రతికూల పర్యావరణ చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఫ్రెంచ్ రైతులు గత కొన్ని రోజులుగా చేస్తున్న ఆందోళన అంతకంతకూ తీవ్రతరమవుతోంది. రైతుల డిమాండ్లను పరిష్కరించకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు వ్యవసాయ ప్రదర్శనను ప్రభుత్వం అట్టహాసంగా పారిస్‌లో ఏర్పాటుచేసింది. రైతులు ఈ ఎగ్జిబిషన్‌ను కూడా ఆందోళన కేంద్రంగా మార్చారు. ఎగ్జిబిషన్‌ను సందర్శించాల్సిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానియెల్ మాక్రాన్ నిరసనలకు భయపడి తన పర్యటనను రద్దు చేసుకున్నారు. రెండు రోజుల క్రితం సెంట్రల్ పారిస్‌లో రైతులు భారీ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఫ్రాన్స్‌లోకి ఇయు వ్యవసాయోత్పత్తులను డంప్ చేయడాన్ని ఆపాలని ఫ్రెంచ్ రైతులు నినదించారు.