పెద్దపల్లి ఏంసిహెచ్ వైద్యురాలు డాక్టర్ ఆర్.శ్రీదేవి సస్పెండ్

– ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
శిశు మరణం ఘటనలో విధులు నిర్వహిస్తున్న పెద్దపల్లి జిల్లా మాత శిశు ఆసుపత్రి డాక్టర్ ఆర్. శ్రీదేవిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ శనివారము ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీరాంపూర్ మండలం మడిపల్లి గ్రామానికి చెందిన కొప్పుల మమతను డాక్టర్ ఆర్.శ్రీదేవి జూన్ 14న ఔట్ పేషెంట్ గా పరిశీలించి మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో చేర్చారు. అదే రోజు డ్యూటీ డాక్టర్ గా ఉన్న గైనకాలజిస్ట్ డాక్టర్ కే.రుక్మిణి ఆధ్వర్యంలో గర్భిణీకి వైద్య చికిత్సలు అందాయి. జూన్ 15న డ్యూటీ డాక్టర్ గా విధులు నిర్వహించిన డాక్టర్ ఆర్.శ్రీదేవి సాయంత్రం కొప్పుల మమతకు ప్రసవం చేయగా శిశువు మరణించింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ విధుల నిర్వహణలో అప్రమత్తంగా లేని డాక్టర్ ఆర్.శ్రీదేవిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 14న డ్యూటీ డాక్టర్ గా విధులు నిర్వహించిన డాక్టర్ కె.రుక్మిణి, గైనకాలజిస్ట్ కు సంజాయిషీ ఇవ్వాల్సిందిగా సూచిస్తూ వారికి మెమో జారీ చేశారు.