పెద్దాపూర్‌ గురుకుల పాఠశాలలో మళ్లీ పాముల కలకలం

పెద్దాపూర్‌ గురుకుల పాఠశాలలో మళ్లీ పాముల కలకలం– ఇద్దరు విద్యార్థులకు పాముకాటు
– ఆస్పత్రిలో చికిత్స.. నిలకడగా ఆరోగ్యం
– వరుస ఘటనలపై తల్లిదండ్రుల ఆందోళన
– మూడు నెలల కిందట ఇద్దరు విద్యార్థులు మృతి
– గురుకులాన్ని సందర్శించిన కలెక్టర్‌
– ప్రిన్సిపాల్‌ సస్పెండ్‌
నవతెలంగాణ – మెట్‌పల్లి
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్‌ గ్రామంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు మళ్లీ పాముకాటుకు గురయ్యారు. మూడు నెలల కిందట పాముకాటుతో గురుకులంలోని ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. బుధవారం రాత్రి ఎనిమిదో తరగతి విద్యార్థి ఓంకార్‌ అఖిల్‌ని పాము కాటు వేయగా, గురువారం ఉదయం మరో విద్యార్థి యస్విత్‌ను పాముకాటు వేసిందని తల్లిదండ్రులు తెలిపారు. విద్యార్థులు అస్వస్థతకు గురైనా సిబ్బంది పట్టించుకోలేదని, కనీసం ఆస్పత్రికి కూడా తీసుకుపోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌ గురుకుల పాఠశాలను సందర్శించి సమస్యల పరిష్కారం కోసం రూ.50లక్షలు విడుదల చేశారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలూ కల్పించాలని అధికారులను ఆదేశించారు. అయినా పాములు రావడంపై పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తోందని తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. రహదారిపై బైటాయించి నిరసన తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్‌ నిర్లక్ష్యం ఉందని, ఆమెను విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.
పాఠశాలను సందర్శించిన కలెక్టర్‌
విద్యార్థులు పాముకాటుకు గురైన విషయం తెలుసుకొన్న జగిత్యాల జిల్లా కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ఆస్పత్రికి చేరుకుని పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం పెద్దాపుర్‌ గురుకుల పాఠశాలను సందర్శించి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనా చెందొద్దన్నారు. గురుకుల పాఠశాల ఆవరణ, పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని, స్నేక్‌ క్యాచర్లతో పాములను పట్టించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గురుకులం చుట్టూ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పొదలు, చెట్లు పెరిగిపోకుండా ఎప్పటికప్పుడూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ఉపాధ్యాయుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. విష సర్పాలు, క్రిమికీటకాలు రాకుండా కిటికీలకు నెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పాముకాటు నుంచి తప్పించుకునే మార్గాలు, ఒకవేళ పాము కాటుకు గురైతే ప్రథమ చికిత్స సంబంధించిన వాటిపై విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కలెక్టర్‌ వెంట ఆర్డీవో శ్రీనివాస్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీవో, వైద్యాధికారులు ఉన్నారు. కాగా, విధుల నిర్వహణలో ప్రిన్సిపాల్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు గుర్తించి సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ సాయంత్రం ఉత్వర్వులు జారీ చేశారు.