మొరం టిప్పర్లకు జరిమానా

మొరం టిప్పర్లకు జరిమానానవతెలంగాణ-తలమడుగు
కజర్ల శివారు ప్రాంతంలో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మొరం తవ్వకాలు జరుపుతున్న టిప్పర్‌ యజమానులకు రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు జరిమానా విధించారు. శుక్రవారం అక్రమ తవ్వకాల గురించి తెలుసుకొని అధికారులు అక్కడికి చేరుకొని రూ.2192 జరిమానా విధించామని రెవెన్యూ సిబ్బంది రోహిదాస్‌, నరేందర్‌, లింగన్న, మైనింగ్‌ అధికారులు తెలిపారు. కజ్జర్ల గ్రామ శివారు ప్రాంతంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూముల్లో చాలా కాలంగా మొరం తవ్వకాలు జరుగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కోట్ల రూపాయల మొరం తరలిపోతోంది. గుర్తుకొచ్చినప్పుడల్లా అధికారులు తూతూమంత్రంగా జరింమానా విధిస్తూ వాహనాలను వదిలేస్తున్నారు. శుక్రవారం కూడా కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు కోట్ల విలువైన మొరం కొల్లగొట్టిన వాహనాల యజమానులకు కేవలం వందల్లో జరిమానా విధించారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లాధికారులు మొరం తవ్వకాలకు అడ్డుకట్ట వేసి ప్రకృతి సంపదను కాపాడాలని మండలవాసులు కోరుతున్నారు.