నవతెలంగాణ-నార్నూర్
మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్‌లో ఉన్న ఆరు నెలల బిల్లులు చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మిక సంఘం రాష్ట్ర సభ్యుడు జాడే నాందేవ్ డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడంతో పాటు కార్మికుల పెండింగ్ బిల్లులు, కోడిగుడ్ల బిల్లులు చెల్లించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన కార్మికులకు వంట సరుకులు, కోడిగుడ్లు, నిత్యావసర సరుకులు సరఫరా చేయాలన్నారు. కార్మికులు అప్పులు చేసి పిల్లలకు పౌష్టికాహారం పెడుతున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస గౌరవ వేతనం రూ. పదివేలు పెంచుతామని హామీ ఇచ్చారని, దాన్ని అమలు చేయాలన్నారు. ఇందులో కార్మికులు తయాబాయి, శివ బాయి, జైతు బాయి, సులోచన, రాము ఉన్నారు.