పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలి

Navatelangana,Telugu News,Telangana,Rangareddy,– మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు అలివేలు
నవతెలంగాణ-కేశంపేట
పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు అలివేలు అన్నారు. సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ప్రారంభమైన మధ్యాహ్న భోజన కార్మికుల రిలే నిరాహార దీక్షలు బుధవారం మూడోవ రోజుకు చేరుకుంది.ఈ సందర్భంగా అలివేలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడుస్తున్నా, మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు చెల్లించడం లేదన్నారు. మెస్‌ చార్జిలు, కోడిగుడ్డు బిల్లులు ఆరు నెలలుగా ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు ప్రతినెలా ఐదోవ తేదీ లోపు వేతనాలు చెల్లిస్తుంది కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు అప్పులు చేసి బంగారం తాకట్టు పెట్టి, వంటలు చేస్తూ పిల్లలకు భోజనాలు పెడుతున్న మధ్యాహ్న భోజన కార్మికులను నిర్లక్ష్యం తగదన్నారు. రంగారెడ్డి జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నాయకులు రాములు, సత్తెమ్మ, యాదమ్మ, అక్కమ్మ సబిత, జంగమ్మ, నిర్మల, కైరున్‌, బాలమణి, కళావతి, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.