ఐదు కోట్లకుపైనే పెండింగ్‌ కేసులు

Pending cases are more than five crores– న్యాయస్థానాల్లో సత్వర విచారణ జరగాలి
– పాత కేసులను పరిష్కరించాలి
– గడువులోగా వాటిని పూర్తి చేయాలి
– దేశవ్యాప్తంగా పేరుకుపోతున్న కేసులపై సుప్రీం తాజా ఆదేశాలు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో పెండింగ్‌ కేసులు కోట్ల సంఖ్యలో పేరుకుపో తున్నాయి. పరిష్కారాలు లభించక తుది తీర్పుల కోసం ఎదురు చూస్తున్నాయి. పిటిషనర్లు సైతం ఈ పెండింగ్‌ కేసులతో విసిగెత్తిపోతున్నారు. అందు బాటులో ఉన్న సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా పలు కోర్టుల్లో దాదాపు 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయస్థానాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పాత కేసులను సత్వ రమే విచారించి, పరిష్కరించాలని వెల్లడించింది. న్యాయవిచారణ ప్రక్రియ ఇలాగే నత్తనడకన కొనసాగితే పిటిషనర్లు తప్పుగా భావించే అవకాశ మున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. గడువులోగా న్యాయ విచారణను పూర్తి చేయాలని తెలిపింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ రవీంద్ర భట్‌ నేతృత్వంలోని బెంచ్‌.. జిల్లా, తాలూకా స్థాయిల్లోని అన్ని కోర్టులను ఆదేశించింది. సమన్లను సక్రమంగా అమలు చేయాలనీ, రాతపూర్వక వాంగ్మూలాలను గడువులోగా దాఖలు చేయాలనీ, ప్లీడింగ్స్‌ పూర్తయిన తర్వాత నిర్ణీత రోజున ఇరుపార్టీలను పిలవాలని స్పష్టం చేసింది. విచారణ ముగిసిన తర్వాత మౌఖిక వాదనలు తక్షణ వినాలనీ, కేసు విచారణ ముగిసిన తేదీ నుంచి 30 రోజులలో సాధారణంగా తీర్పులు వెలువడాలని తెలిపింది.
ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులకు సంబంధించి గణాంకా లను ప్రతి ప్రిసైడింగ్‌ అధికారి నెలకు ఒకసారి ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జికి పంపాలనీ, వారు (ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి లేదా జిల్లా జడ్జి) వాటిని క్రోడీకరించి తదుపరి చర్యలు తీసుకోవడానికి వీలు కల్పించటం కోసం సంబంధిత హైకోర్టుల ద్వారా ఏర్పాటైన రివ్యూ కమిటీకి పంపాలని వెల్లడించింది.
నేషనల్‌ జ్యుడీషియల్‌ డేటా గ్రిడ్‌ ప్రకారం.. జిల్లా కోర్టుల్లో 4,37,35,155 కేసులు (3,30,43,812 క్రిమినల్‌, 1,06,91,343 సివిల్‌) పెండింగ్‌లో ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా 25 హైకోర్టుల్లో 84,68,084 కేసులు (17,36,714 క్రిమినల్‌, 67,31,370 సివిల్‌ కేసులు) పెండింగ్‌లో ఉండటం గమనార్హం.