– ఎస్టీయూటీఎస్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రెండున్నరేండ్లుగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం (డీఏ)లను వెంటనే విడుదల చేయాలని ఎస్టీయూటీఎస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం పర్వత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి సదానందంగౌడ్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా, ఆర్నెళ్లకోసారి ప్రభుత్వం చెల్లించే డీఏ రెండున్నరేండ్లుగా అమలుకు నోచుకోవడం లేదని తెలిపారు. పీఆర్సీ గడువు ముగిసి, ఈనెలతో ఏడాది కాలమైందని పేర్కొన్నారు. అయినప్పటికీ సంబంధిత కమిటీ మాత్రం నివేదికను ప్రభుత్వానికి నేటికీ సమర్పించడం లేదని తెలిపారు. ప్రతినెలా మొదటి తారీఖున వేతనాలు చెల్లిస్తున్న ప్రభుత్వం, పెండింగ్‌లో ఉన్న డీఏలు, పీఆర్సీల గురించి మంత్రిమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. అన్నదాతలకు ప్రభుత్వం రూ.రెండు లక్షల రుణమాఫీ చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నో అవాంతరాలను అధిగమించి, బదిలీలు, పదోన్నతులు పూర్తి చేసిన తరహాలో, ఉపాధ్యాయ ఉమ్మడి సర్వీస్ నిబంధనలను రూపొందించి, ఖాళీగా ఉన్న ఎంఈవో, డిప్యూటీ ఈవో, డైట్, జూనియర్ లెక్చరర్ పోస్టులకు పదోన్నతులను కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలిపారు. 317 జీవో సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని సూచించారు.