– మండలిలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం (డీఏ)ను విడుదల చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసనమండలి సమావేశంలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశంపై ఆయన మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఒకటో తేదీన జీతాలు వస్తాయా? రావా? అన్న ఆందోళన ఉండేదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 15వ తేదీ వరకు జీతాలొచ్చే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. మార్చి నుంచి ఒకటో తేదీన జీతాలివ్వడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. ఈ-కుబేర్‌లో ఉద్యోగులకు సంబంధించిన వివిధ రకాల బిల్లులకు సంబంధించి రూ.40 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను మంజూరు చేయాలని కోరారు. ఉద్యోగులకు జనవరి, డిసెంబర్‌లో ఏటా రెండు సార్లు డీఏలు రావాల్సి ఉంటుందని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు డీఏలు వచ్చాయనీ, ఒక డీఏ పెండింగ్‌లో ఉందని అన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయనీ, వాటిని చెల్లించాలని కోరారు. డీఏలను ఎప్పటిలోగా చెల్లిస్తారో చెప్పాలని బీఆర్‌ఎస్ సభ్యులు వాణీదేవి ప్రశ్నించారు. పెన్షనర్లకు డీఆర్‌ను ఇవ్వాలని ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్‌రావు అడిగారు. వారికి నగదు రహిత వైద్యం అందించాలని సూచించారు.
త్వరలోనే డీఏలు చెల్లిస్తాం : భట్టి
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో త్వరలోనే ఉద్యోగులకు డీఏలను చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ధనిక రాష్ట్రం ఉన్నపుడే ఏడు నెలల నుంచి రెండేండ్ల వరకు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. తాము అంత సమయం తీసుకోబోమనీ, త్వరలోనే డీఏలను చెల్లిస్తామని అన్నారు. డీఏలు ఇవ్వాలనే నిర్ణయంతో ప్రభుత్వం ఉందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.ఏడు లక్షల కోట్లు అప్పులు చేసిందని వివరించారు. నాడు సకాలంలో జీతాలివ్వలేని పరిస్థితి ఉండేదనీ, 15వ తేదీ వరకు జీతాలిచ్చేదని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామనీ, ఉద్యోగులకు మార్చి నుంచి ఒకటో తేదీన జీతాలిస్తున్నామని చెప్పారు. అందుకోసం రూ.ఐదు వేల కోట్లు ఇవ్వాలని వివరించారు. అప్పులు రూ.ఏడు వేల కోట్లు చెల్లించాలని అన్నారు. అప్పులు కట్టడానికి మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని విమర్శించారు. కాళేశ్వరం కడితే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిరుపయోగంగా మారాయని చెప్పారు. ఉద్యోగులకు సంబంధించి డీఏలతోపాటు వివిధ రకాల బిల్లులు రూ.40 వేల కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. జీతాలతోపాటు డీఏలను చెల్లించాల్సి ఉందన్నారు. కొద్దిరోజుల్లో వాటిని చెల్లిస్తామని అన్నారు.