– బిల్లులు వెంటనే చెల్లించాలి
– బీకేఎంయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధుల జంగయ్య
నవతెలంగాణ-షాద్‌నగర్
ఉపాధి హామీ కూలీల పెండింగు బిల్లులు వెంటనే చెల్లించాలని బీకేఎంయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్దుల జంగయ్య అన్నారు. ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని కాశిరెడ్డి గూడ గ్రామంలో ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు, ఏడూ వారాలుగా పని చేసిన ఉపాధి కూలీలకు డబ్బులు ఇవ్వలేదన్నారు. వారికి సౌకర్యాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు వారం, వారం డబ్బులిచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అవసరం తీరాక ప్రజల భాధలు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ‘ఎన్నికలు అయిపోయాయి కదా, ఓట్లు వేశారు, ఇంకా పేదలతో మాకేం సంబంధం అని వ్యవహారిస్తే’ ఉపాధి కూలీల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యకాస మండల నాయకులు శంకర్, అంజయ్య, సునీత, రాములమ్మ, జయమ్మ, అంజయ్య పాల్గొన్నారు.