పెండింగ్‌ గౌరవ వేతనాలు విడుదల చేయాలి

Pending honoraria should be released– గుడ్ల బిల్లులు ఇప్పించేలా చూడండి
– ఎన్నికల హామీ మేరకు రూ.10 వేలివ్వాలి
– విద్యాశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ లింగయ్యకు తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెండింగ్‌ గౌరవ వేతనాలను వెంటనే విడుదల చేయాలనీ, గుడ్ల బిల్లులు చెల్లించేలా చూడాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. బుధవారం ఈ మేరకు హైదరాబాద్‌లోని పాఠశాల విద్యా శాఖ కార్యాలయంలో అడిషనల్‌ డైరెక్టర్‌ లింగయ్యకు ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు వై.స్వప్న, ప్రధాన కార్యదర్శి ఎస్వీ.రమ, ఉపాధ్యక్షులు జి.పద్మ, కార్యదర్శి సత్య నారాయణ, రాష్ట్ర కమిటీ సభ్యులు రాణి, సీహెచ్‌ లక్ష్మి వినతిపత్రం అందజేశారు. నెలల తరబడి మధ్యాహ్న భోజన పథకం బిల్లులు రాకపోవడంతో కార్మికులు అప్పులు చేసి మరీ పిల్లలకు వండిపెడుతున్న విషయాన్ని అడిషనల్‌ డైరెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. పెరిగిన వేతనం కొన్ని జిల్లాల్లో, కొన్ని మండలాల్లో మాత్రమే ఇచ్చారని ప్రస్తావించారు. ప్రస్తుతం కేటాయించిన బడ్జెట్‌ పాత మెనూకే సరిపోవడం లేదని వాపోయారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు రెండు గుడ్లకే సరిపోవడం లేదు మూడో గుడ్డు ఎలా పెట్టాలి? రాగిజావా ఎలా పోయాలి? అని ప్రశ్నించారు. గుడ్లకు అదనపు బడ్జెట్‌ కేటాయించాలనీ, లేనిపక్షంలో అంగన్‌వాడీ కేంద్రాలకు చేస్తున్నట్టుగానే పాఠశాలలకు గుడ్లను సరఫరా చేయాలని కోరారు. లేకుంటే డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి గుడ్లను బంద్‌ పెడతామని హెచ్చరించారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు అవసరమైన గ్యాస్‌ను సబ్సిడీకి ఇవ్వాలని విన్నవించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేల రూపాయల గౌరవ వేతనాన్ని వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. పెరిగిన ధరలకనుగుణంగా పిల్లలికిచ్చే మెనూ చార్జీలు పెంచాలని డిమాండ్‌ చేశారు. కాటన్‌ బట్టల యూనిఫామ్‌ ఇవ్వాలనీ, సామాజిక భద్రత కల్పించాలని కోరారు. మధ్యాహ్న భోజన నిర్వహణను అక్షయ పాత్ర లాంటి స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వరాదని విజ్ఞప్తి చేశారు. ప్రమాద బీమా, పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలనీ, షరతుల్లేకుండా బ్యాంక్‌ ద్వారా రుణాలివ్వాలని కోరారు. పబ్లిక్‌ ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (పిఎఫ్‌ఎంఎస్‌) ద్వారా బిల్లులు, జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అడిషనల్‌ డైరెక్టర్‌ సానుకూలంగా స్పందిస్తూ గుడ్ల బిల్లులు పెంచడానికి ప్ర్రభుత్వానికి ప్రపోజల్‌ పంపామని, 1-5 క్లాసుల బిల్లులు క్లియర్‌ చేశామని తెలిపారని చెప్పారు. మిగతా వాటిని కూడా వీలైనంత త్వరగా పరిష్కారం చేస్తామని హామీనిచ్చారన్నారు.